పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కంఠమనేని ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్
- IndiaGlitz, [Saturday,August 24 2019]
శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. యువ కథానాయిక నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్. శ్రీనివాసరెడ్డి ప్రధాన తారాగణం. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్’ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... అశోక్ కుమార్ క్లాప్ ఇచ్చారు. చంద్ర సిద్ధార్థ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అతిథులుగా హాజరయ్యారు.
శివ కంఠమనేని మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు మేం లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇది మా రెండో ప్రొడక్షన్. కుటుంబ కథా చిత్రమిది. అలాగే, సస్పెన్స్ థ్రిల్లర్! ఇందులో నేను, రాశిగారు లీడ్ రోల్స్ చేస్తున్నాం. హీరోయిన్‌గా నందితా శ్వేతగారు చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి మరో లీడ్ రోల్ చేస్తున్నారు. మా దర్శకుడు సంజీవ్ మేగోటి ఇంతకు ముందు తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. రెండు షెడ్యూళ్ళల్లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. ఇది పూర్తయిన తర్వాత పది పదిహేను రోజులు విరామం తీసుకుని రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఆల్రెడీ నాలుగు పాటలు రికార్డ్ చేశాం. పాటలు విన్న వారందరూ మంచి బావున్నాయని ప్రశంసించారు. ఒక మంచి సినిమా ప్రేక్షకులు అందివ్వాలని మా తాపత్రయం’’ అని అన్నారు.
రాశి మాట్లాడుతూ ‘‘చాలా గ్యాప్ తర్వాత మంచి సినిమాతో నేను మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ముఖ్యంగా నాకు కథ బాగా నచ్చింది. వెరీ బోల్డ్, ఇండిపెండెంట్ విమెన్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా రోజులకు నాకు నచ్చిన పాత్ర వచ్చింది. ఈ మధ్యలో చాలా పాత్రలు వచ్చాయి. కానీ, నేను యాక్సెప్ట్ చేయలేదు. ఇందులో నందితా శ్వేత నా కుమార్తెగా చేస్తోంది. తనతో నేను తొలిసారి నటిస్తున్నా. అలాగే, చాలా రోజుల తర్వాత అన్నపూర్ణమ్మగారితో సినిమా చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ‘‘లైట్ హౌస్ అంటే చాలా వెలుతురుగా ఉంటుంది. చాలా దూరం కనిపిస్తుంది. మా సినిమా కూడా చాలా బాగా, బ్రహ్మాండంగా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా బావుంటుంది. రాశి చెప్పినట్టు నాదీ ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఇందులో రాశి నా కుమార్తెగా, నందిత నా మనవరాలిగా నటిస్తున్నారు. అందరి ఆశీర్వాదంతో నాకు వెరైటీ క్యారెక్టర్లు లభిస్తున్నాయి’’ అని అన్నారు.
నందితా శ్వేత మాట్లాడుతూ ‘‘నేను తమిళ్, కన్నడ సినిమాలు చేస్తున్నప్పుడు ‘మీరు తెలుగు సినిమాలు చేస్తారా? ఓన్లీ గ్లామర్ రోల్స్ ఉంటాయి?’ అని అక్కడివారు అడిగేవారు. నేను వెయిట్ చేసి చేసి మంచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటివరకూ గ్లామర్ కంటే ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించాను. ఫీమేల్‌కి వేల్యూ ఉన్న పాత్రలే చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో గ్లామర్ రోల్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు లక్కీ. టెర్రర్ గాళ్‌గా కనిపిస్తా. మంచి మంచి యాక్టర్స్‌తో చేస్తున్నా. నేను నేర్చుకోవడానికి ఎంతో స్కోప్ ఉంది. నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అని అన్నారు.
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ ‘‘నేను చాలా ఏళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేశాను. తర్వాత కర్ణాటక వెళ్లాను. కన్నడలో ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాను. స్ర్కీన్‌ప్లే రైటర్‌గా కన్నడ, తెలుగు ఛానల్స్‌లో బిజీగా ఉన్నాను. మంచి ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్న టైమ్‌లో కొత్తదనంతో కూడిన కథ రెడీ చేశా. కథ ప్రకారం 40, 45 సంవత్సరాల వయసు ఉన్న హీరో కావాలి. సరైన కథకు సరైన నటీనటులు లభిస్తే ఎంత బావుంటుందో ప్రేక్షకులందరికీ తెలుసు. శివ కంఠమనేని, రాశి, నందిత, అన్నపూర్ణమ్మ, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్... ఇలా మంచి మంచి నటీనటులు కుదిరారు. కథకు ఏం కావాలో చెప్పమని అడిగిన నిర్మాతలకు థ్యాంక్స్. ‘బుద్ధం శరణం గచ్చామి’... అంటే శాంతంగా ఉండాలన్న దేవకి పాత్రలో రాశిగారు నటిస్తున్నారు. ‘బుద్ధం శరణం గచ్ఛామి కాదు... యుద్ధం శరణం గచ్ఛామి’... అంటే ఇప్పుడున్న కాలంలో శాంతంతో కాదు, ఆలోచిస్తూ ఆవేశంతో సమస్యలను ఎదుర్కొవాలన్న పాత్రలో శివ కంఠమనేనిగారు నటిస్తున్నారు. శాంతం, ఆవేశం అన్నీ కలగలిపితేనే జీవితం అనే క్యారెక్టర్‌లో నందితా శ్వేతాగారు నటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఢిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో, సెకండ్ షెడ్యూల్‌లో వైజాగ్‌లో చేస్తాం’’ అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘గత ఏడాది శివ కంఠమనేని హీరోగా ‘అక్కడొకటుంటాడు’ సినిమా చేశాం. ఇప్పుడు మా రెండో సినిమా ప్రారంభించాం. ఇందులోనూ శివ కంఠమనేని హీరో. ఈ సినిమా కంటే ముందు చాలా కథలు విన్నాం. సంజీవ్ మేగోటిగారు మంచి కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ సినిమా మొదలుపెట్టాం. అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా తీస్తున్నాం’’ అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రాంబాబు యాదవ్ మాట్లాడుతూ ‘‘కథ నచ్చి మేమంతా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాం. ఈ సినిమా బాగా వస్తుందని మా దర్శకుడు, మాటల రచయిత పనితనం చూస్తే అర్థమవుతుంది. పెద్దలు, పిల్లలు, కుటుంబం అందరూ రెండు గంటలు ఆనందించే సినిమా తీయాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రజలు మొదటి సినిమాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ సినిమాకూ అదే విధంగా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారని, ఆశ్వీరదిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
సంగీత దర్శకుడు సుధాకర్ మారియో మాట్లాడుతూ ‘‘యశస్వినీ గున్నుగారితో కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాను. సంజీవ్‌గారు ఇంతకు ముందు చేసిన సినిమాలకు నేను కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేశా. నాకు సంగీత దర్శకుడిగా పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకుడికి థ్యాంక్స్’’ అని అన్నారు.
మాటల రచయిత అంజన్ మాట్లాడుతూ ‘‘ప్రముఖ ఛానల్స్‌లో వస్తున్న మెగా సీరియల్స్‌కి నేను మాటలు రాశా. ఇంతకు ముందూ చాలా వాటికి రాశాను. సినిమాకు మాటలు రాయాలన్న తపన, ఆశయం నాలో ఉన్నాయి. లైట్ హౌస్ సినీ మేజిక్ వాళ్లు నాకు అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కథకు మంచి మాటలు రాస్తే వచ్చే ఆనందం, రిజల్ట్ అందరికీ తెలిసిందే. సంజీవ్‌గారు మంచి కథ అందించారు. ఇటువంటి కథకు కమర్షియల్ హంగులు, మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉన్నప్పుడు మాటలు రాయడం ఎంత ఉత్సాహంగా ఉంటుంది’’ అని అన్నారు.
శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశి, శ్రీనివాసరెడ్డి, కె. అశోక్‌కుమార్, అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, ‘బిత్తిరి సత్తి, అజయ్ ఘోష్, ఆదిత్యా మీనన్, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.