ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివబాలాజీ
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి కారణంగా అరకొర జీతాలతో బతికేస్తున్న జనాలపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నాయి. నిర్వహించేది ఆన్లైన్ క్లాసులైనప్పటికీ బరాబర్‌గా స్కూలు ఫీజు మొత్తం చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నాయి. తమ పిల్లలు చదువుతున్న ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై సినీ నటుడు శివబాలాజీ ఎదురు తిరిగారు. దీంతో ఆయనను సదరు స్కూలు యాజమాన్యం వాట్సాప్ నుంచి తొలగించింది.
నటుడు శివబాలాజీ ప్రైవేటు స్కూలు యాజమాన్యం తీరు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోందని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఏడేళ్లుగా తన కుమారుడిని నగర శివారు మణికొండలోని ఓ స్కూల్లో చదివిస్తున్నానని, అధిక ఫీజులపై ప్రశ్నించినందుకు ఆన్లైన్ క్లాస్‌ల వాట్సాప్ గ్రూప్ నుంచి తన ఫోన్ నంబర్‌ను తొలగించారని ఆయన ఆరోపించారు.
కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండగా.. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని హెచ్చార్సీ దృష్టికి తీసుకెళ్లారు. జూన్‌లో స్కూలు ఫీజుల తగ్గింపు విషయమై 240 మంది విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యానికి మెయిల్ చేశారని, ఆగస్టు 11 వరకు సమాధానం ఇవ్వలేదని వెల్లడించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల వేధింపుల నుంచి తల్లిదండ్రులను రక్షించాలని, ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా.. శివ బాలాజీ ఫిర్యాదును హెచ్చార్సీ విచారణకు స్వీకరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout