SIT Report: ఏపీ ఎన్నికల్లో హింసపై సిట్ నివేదిక.. అందులో ఏముందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు, అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ అందజేశారు. హింసాత్మక ఘటనలపై 150 పేజీల నివేదిక రూపొందించింది. తిరుపతి, అనంతపురం, పల్నాడు, జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ గుర్తించింది. సిట్ రిపోర్ట్ ప్రకారం అల్లర్లపై 33 కేసులు నమోదుకాగా 1370 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో 124 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఈ 33 కేసులలో పల్నాడు జిల్లాలో 22 కేసులు, అనంతపురంలో 7 కేసులు, తిరుపతిలో 4 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది.
స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేసింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేశారని నివేదికలో పేర్కొంది. ఎన్నికల సమయంలో పోలీసులు స్థానిక నేతలతో కుమ్మక్కయ్యారని అభిప్రాయపడింది. హింసాత్మక ఘటనలు జరుగుతున్నా కూడా నిర్లక్ష్యం వహించడమే ఇందుకు నిదర్శనమని ప్రస్తావించింది. ఈ నివేదిక ఆధారంగా కొందరు అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది రాజకీయ నేతలపై కూడా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
కాగా ఎన్నికల సమయంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర ఎన్నికల సంఘం డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యంలో 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అల్లర్లు, హింస చెలరేగిన పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, మరికొన్ని ప్రాంతాల్లో సిట్ బృందాలు రెండు రోజుల పాటు పర్యటించాయి. స్థానికులు, నేతలతో పాటు పోలీసులను విచారించి పలు వివరాలు సేకరించి ప్రాథమిక నివేదిక రూపొందించాయి.
మరోవైపు కౌంటింగ్ రోజుతో పాటు తర్వాత 15 రోజుల వరకు అల్లర్లు చోటుచేసుకునే అవకాశం ఉందని ఈసీ హెచ్చరించింది. దీంతో భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి తరలించారు. అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు కూడా కౌంటింగ్ రోజు సమస్యాత్మక నియోజకవర్గాలతో పాటు పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో ఘర్షలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చర్యలకు సిద్ధమవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments