BiggBoss: శ్రీహాన్‌పై సిరి ముద్దుల వర్షం... కీర్తి కోసం మహేశ్, మమతల కోవెలలాగా బిగ్‌బాస్
Send us your feedback to audioarticles@vaarta.com
గొడవలు, వివాదాలతో రచ్చరచ్చగా వుండే బిగ్‌బాస్ హౌస్ ఇప్పుడు మమతల కోవెలలాగా, అనుబంధాల పొదరిల్లులాగా మారిపోయింది. కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తున్నారు. తొలుత ఆదిరెడ్డి భార్యా కూతురు, రాజశేఖర్ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టి అందరిని సర్ప్రైజ్ చేశారు. ఎవరికి తోచిన విధంగా వారు తమ వాళ్ల ఆటతీరు మెరుగు పరచుకునేందుకు సలహాలు ఇచ్చారు. ఇక బుధవారం ఫైమా తల్లి, శ్రీసత్య తల్లిదండ్రులు, రోహిత్ అమ్మగారు ఇంట్లోకి వచ్చి సందడి చేశారు.
అయితే గురువారం మాత్రం షో అదిరిపోయింది. శ్రీహాన్ లవర్ మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరి హనుమంతు ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాగానే కళ్లతోనే కుశల ప్రశ్నలు వేసిన శ్రీహాన్ కన్నుకొట్టాడు. సిరి కూడా శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ సందర్భంగా వీపుపై పచ్చబొట్టుగా వున్న శ్రీహాన్ పేరుని అతనికి చూపించింది. ఇనయా, శ్రీసత్యలపై సెటైర్లు వేస్తూ సిరి సందడి చేసింది. ఈ లోపు శ్రీహాన్- సిరిల కొడుకు చైతన్య హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో కంటెస్టెంట్ మాట తీరుని, హావభావాలను అనుకరించి చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. ఈ బుడ్డోడి అల్లరికి, ఎనర్జీకి అంతా షాక్ అయ్యారు.
అయితే ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఆ బాబు ఎవరు అనేదానిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడిచింది. నిజానికి సిరి- శ్రీహాన్‌లు కలిసే వుంటున్నా చైతన్య వాళ్లకు పుట్టిన పిల్లాడు కాదు. ఆ బాబు సిరి మేనమామ కొడుకు. ఈ విషయాన్ని ఆమె తల్లి శ్రీదేవి స్వయంగా చెప్పారు. సిరి కూడా స్వయంగా బిగ్‌బాస్ హౌస్‌లో వుండగా చైతూ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ‘‘వాడిని నేను కనకపోయినా.. చైతూతో చాలా బాండింగ్ వుంది’’ అని చెప్పింది.
మరోవైపు.. తనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేరని..బంధువులు కూడా దూరం పెట్టేశారని ఇప్పుడు తన కోసం బిగ్‌బాస్ హౌస్‌కి ఎవరు రారంటూ బాధపడుతున్న కీర్తిభట్కు ట్రీట్ ఇచ్చారు బిగ్‌బాస్. బుల్లి తెర నటుడు మహేశ్ ఆమె కోసం ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడంతోనే అందరిపైనా సెటైర్లు వేశాడు. కీర్తితో కలిసి డ్యాన్సులు వేసి హగ్ చేసుకున్నాడు. గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. జీవితంలో ఎన్నో కోల్పోయావని... కానీ బిగ్‌బాస్ నీకు మంచి ఛాన్స్ ఇచ్చాడని, గెలిచి చూపించాలని కీర్తికి ధైర్యం నూరిపోశాడు మహేశ్. వెళ్తు వెళ్తూ ఆమె దత్తత తీసుకున్న పాప ఫోటోని బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ చిన్నారిని కాపాడుకోలేకపోయానంటూ బోరున ఏడ్చింది కీర్తి.
కాసేపటికి ఇనయా తల్లి నజ్బూర్ బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. చాలా రోజుల తల్లిని చూడగానే ఇనయా ఎమోషనలైంది. కొద్దికాలంగా కూతురికి దూరంగా వుంటున్న ఆమె.. బిగ్‌బాస్ హౌస్‌లో ఇనయా చేస్తున్న పోరాటాన్ని మెచ్చుకున్నారు. కప్పు గెలిచి ఇంటికి రావాలని ఆకాంక్షించారు. చివరిగా తల్లి పాదాలకు నమస్కరించింది ఇనయా. అనంతరం అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నారు నజ్బూర్. హౌస్‌లో వున్న వారందరీని వారి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇక మిగిలింది రేవంత్ ఒక్కరే. ఆయన కోసం బిగ్‌బాస్ ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నాడా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments