అమితాబ్ సినిమాకి సిరాశ్రీ హిందీ పాట
- IndiaGlitz, [Friday,May 05 2017]
దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు, సంగీత దర్శకులు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా? తొలిసారిగా తెలుగు సినీగీతరచయిత సిరాశ్రీ బాలీవుడ్ సినిమాకి పాట రాసారు. అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న "సర్కార్-3" చిత్రానికి గాను సిరాశ్రీ "థాంబా.." అంటూ ఒక హిందీ పాట రాయడం జరిగింది.
"మొదటిసారిగా సర్కార్3 కోసం హిందీలో తెలుగు గీతరచయిత సిరాశ్రీ "థాంబా" అనే పాట రాసాడు". అని ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దీనిపై సిరాశ్రీ స్పందిస్తూ, "తెలుగులో పాటలు రాసుకునే నేను హిందీ సినిమాకు పాట రాస్తానని కలలో కూడా కలగనలేదు. అది కూడా సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ కి రాస్తానని అసలు ఊహలో కూడా ఊహించలేదు.ఆర్జీవి ఇక తెలుగులో సినిమాలు చెయ్యను అన్నారు. అది జరిగితే, ఇక ఆయనకు నాతో గీతరచయితగా జర్నీ ఆగిపోయినట్టే. అది జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలా నా నుంచి హిందీపాట తన్నుకొచ్చింది అని నా ఫీలింగ్. "నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్" కదా! ఏళ్లతరబడి చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాంపుల వల్ల పట్టుబడిన కొంత హిందీ, ఆర్జీవీ సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు...ఇలా అన్ని విషయాలు నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి." అని ఫేస్ బుక్కులో పోస్ట్ చేసాడు.
బాహుబలి2 తో రాజమౌళి, దాదాసాహెబ్ ఫాల్కేతో కే విశ్వనాథ్ తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో జెండా ఎగరేస్తున్న తరుణంలో సిరాశ్రీ కూడా బాలీవుడ్డులో దక్షిణాది నుంచి కొత్త రికార్డు తెరవడం తెలుగు వారు గర్వించాల్సిన విషయమే.