AP SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. 71 స్కూళ్లలో అంతా ఫెయిలే, ఎందుకిలా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 11,671 పాఠశాలలకు చెందిన విద్యార్ధులు పరీక్షలు రాయగా.. వీటిలో 797 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. 71 పాఠశాలల్లో ‘సున్నా’ శాతం ఉత్తీర్ణత అంటే ఎవ్వరూ పాసవ్వలేదు. ఇందులో 31 ప్రైవేట్ పాఠశాలలు, 18 ఎయిడెడ్ పాఠశాలలు వున్నాయి. దీంతో ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాకపోవడం ఏంటనీ ఆయా స్కూళ్ల యాజమాన్యాలు సమీక్షలకు దిగాయి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ ఎలా వుంటుందో వేచి చూడాలి.
పర్సంటేజ్ తగ్గడానికి కారణమిదే: బొత్స
అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత తగ్గడానికి కరోనానే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. గడిచిన రెండేళ్లుగా చదువులు సరిగ్గా సాగలేదని మంత్రి చెబుతున్నారు. అందుకే ఉత్తీర్ణత సాధించని విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. సప్లిమెంటరీ పరీక్షను నిర్వహిస్తామని బొత్స తెలిపారు. అలాగే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రేపటి నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుందని.. ఈ నెల 13 నుంచి ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నామని బొత్స వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్ధులతో పాటు చదువుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.
ఫలితాల్లో ప్రకాశం ఫస్ట్.. అనంతపురం లాస్:
ఇకపోతే.. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. 2,02,821 మంది బాలురు పాసైతే.. 2,11,460 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 67.26 శాతం ఉత్తీర్ణత శాతం నమోదవ్వగా.. ఇందులో బాలురు 64.02 శాతం, బాలికల్లో 70.70 శాతం మంది పాసయ్యారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా (78.30 శాతం) ప్రథమ స్థానంలో వుండగా.. అనంతపురం జిల్లా (49.70 శాతం) చివరి స్థానంలో నిలిచింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments