మొన్న రోజా.. ఇప్పుడు శ్రీవాణి, మరో వివాదంలోకి ఇండిగో ఎయిర్‌లైన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవలికాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటోంది. కొద్దిరోజుల క్రితం నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా తదితర ప్రముఖులు ప్రయాణించిన విమానం.. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లే క్రమంలో సాంకేతిక కారణాలతో తిరుపతిలో కాకుండా బెంగళూర్‌లో అయింది. అప్పటికే నాలుగు గంటలు గాల్లో చక్కర్లు కొట్టడంతో పాటు బెంగళూర్‌లో ల్యాండ్ అయినా డోర్లను తెరవకుండా ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది ఇండిగో.
ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని తిరుపతికి కాకుండా బెంగళూర్‌కు తీసుకెళ్లి.. డోర్లు తెరవకుండా మానసిక వేదనకు గురిచేశారని మండిపడ్డారు. తొలుత వాతావరణ కారణాలని... తరువాత సాంకేతిక కారణాలని అంటున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తేలిగ్గా వదలనని, కోర్టును ఆశ్రయిస్తానని రోజా హెచ్చరించారు.
ఈ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోని సదరు సంస్థ రోజుల వ్యవధిలోనే మరో సెలబ్రెటీ విషయంలో ఇలాగే వెలగబెట్టింది. ప్రముఖ గాయనీ వీణ శ్రీవాణికి తాజాగా ఇండిగో నుంచి చేదు అనుభవం ఎదురైంది. గమ్యస్థానానికి వెళ్లినా లగేజీని ఇంకా తన వద్దకు చేర్చలేదంటూ ఆమె ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ షో కోసం తాను రాజమండ్రి వచ్చానని.. మేము తెచ్చుకున్న లగేజీ, మోతాదుకు మించి ఉందంటూ ఫ్లైట్ ఎక్కే సమయంలో అడ్డుకున్నారని శ్రీవాణి చెప్పారు. ఇందుకు గాను అధికారులు తమ వద్ద కొంత డబ్బు వసూలు చేశారని... తీరా గమ్యస్థానానికి చేరుకున్నాక.. లగేజీ మాత్రం ఇంకా తమ వద్దకు చేరుకోలేదని శ్రీవాణి మండిపడ్డారు. దీనిపై ఆరా తీస్తే.. తాము వచ్చిన ఫ్లైట్‌లో ఖాళీ లేదని.. మరో విమానంలో లగేజీని తీసుకువస్తున్నారని చెబుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన షో ఆలస్యమైతే బాధ్యత ఎవరిదని శ్రీవాణీ మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments