ఆ వ్యక్తి కనిపిస్తే దేహశుద్ధి తప్పదు: సింగర్ సునీత

  • IndiaGlitz, [Tuesday,July 28 2020]

ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత చైతన్య అనే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చైతన్య అనే వ్యక్తి తన మేనల్లుడినని చెబుతూ తన పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి నుంచి డబ్బు కూడా వసూలు చేశాడని సునీత తెలిపారు. విషయం తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అసలు చైతన్య అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని.. అతడిని తానెప్పుడూ కలవలేదని వెల్లడించారు.

తనకు అసలు చైతన్య అనే అల్లుడు లేడని.. తన పేరు ఉపయోగించుకుని అమాయకులను మోసం చేస్తున్నట్టుగా తనకు తెలిసిందని సునీత తెలిపారు. ఆ చైతన్య కనిపిస్తే దేహశుద్ధి తప్పదని హెచ్చరించారు. సెలబ్రిటీల పేరు చెప్పగానే ఎలా డబ్బులిస్తారని సునీత ప్రశ్నించారు. ప్రతిరోజూ మీడియాలో ఇలాంటి మోసగాళ్లకు సంబంధించిన వార్తలొస్తున్నా.. ఎలా నమ్ముతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైతన్యపై తాను కేసు నమోదు చేయనున్నానని సునీత తెలిపారు.