Rahul Sipligunj :ఎమ్మెల్యేగా పోటీ అంటు ప్రచారం ... పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
- IndiaGlitz, [Saturday,August 26 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే 115 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి కేసీఆర్ విపక్షాలను డిఫెన్స్‌లోకి నెట్టారు. గులాబీ దళపతి ఇంత స్పీడుగా వుంటే.. కాంగ్రెస్, బీజేపీల్లో ఇంకా అభ్యర్ధుల కసరత్తే పూర్తి కాలేదు. కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. టికెట్లు కోరుతున్న ఆశావహుల నుంచి టీపీపీసీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. నిన్నటితో ఆ గడువు ముగియగా.. దాదాపు 1000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని గోషా మహాల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి ఉత్సాహం చూపుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘గడిచిన కొన్ని రోజులుగా తన మీద ఇలాంటి రూమర్లు వస్తున్నాయని, అన్ని పార్టీలకు చెందిన నేతలు తనకు ఇష్టమే. తాను ఒక కళాకారుడినని, తనకు ప్రజలకు వినోదం పంచడమే ఇష్టం.. ఇలాంటి రూమర్లు ఎందుకు వచ్చాయో తెలియడం లేదు. తాను మ్యూజిక్ కెరీర్‌లోనే వుంటా, ఇక్కడ నేను చేయాల్సింది ఎంతో వుంది. ఏ పార్టీలో చేరమని నన్నూ ఎవరూ అడగలేదు. నేనూ ఎవ్వరినీ అడగలేదు.. దయచేసి ఈ రూమర్లను ఆపండి’’ అంటూ రాహుల్ సిప్లిగంజ్ విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్ట్‌తో రాహుల్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయ్యింది.
కాగా.. తొలుత యూట్యూబ్‌లో పాటలు , ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్‌కు తర్వాత సినిమాల్లో అవకాశాలు లభించాయి. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో హిట్ సాంగ్స్ ఆలపించిన రాహుల్ సిప్లిగంజ్‌కు యువతలో మంచి పాపులారిటీ వుంది. బిగ్‌బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన ఆయనకు ఈ ఏడాది మెమొరబుల్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌లోని ‘‘నాటు నాటు’’ పాటను కాలభైరవతో పాటు రాహుల్ ఆలపించాడు. ఈ సాంగ్‌కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ లభించింది. అంతేకాదు.. ఆస్కార్ వేదికపై అతిరథ మహారథుల ముందు నాటు నాటు పాటను ఆలపించి అరుదైన ఘనతను అందుకున్నాడు.