Singer Mano:గాయకుడు మనోకు డాక్టరేట్.. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మల్టీ టాలెంటెడ్..?

  • IndiaGlitz, [Sunday,April 16 2023]

మనో.. ఈ పేరు తెలియని తెలుగువారు, సంగీత ప్రియులు వుండరు. నేపథ్య గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా , రియాలిటీ షోలకు జడ్జిగా ఇలా తనలో వున్న బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు మనో. తన నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయన తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ సంగీతానికి చేసిన సేవలకు గాను ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని రిచ్‌మండ్ గాబ్రియేల్ యూనివర్సిటీ మనోకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను మనో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనపై మీ ప్రేమ ఎప్పటికీ ఇలానే వుండాలని మనో ఆకాంక్షించారు.

15 భారతీయ భాషల్లో పాటలు :

ఇక మనో కెరీర్ విషయానికి వస్తే.. ఆయన అసలు పేరు నాగూర్ బాబు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 1965 అక్టోబర్ 26న ఆయన జన్మించారు. తల్లిదండ్రులు షాహీదా బాబు, రసూల్ బాబు. మనో తండ్రి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల మక్కువ వుండటంతో మనోకు ఆయన తండ్రి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వద్ద చేరారు. ఆయనే నాగూర్ బాబు పేరును మనోగా మార్చారు. ఆ తర్వాత చక్రవర్తి వద్ద అసిస్టెంట్‌గా పనిచేసి సంగీతం, నేపథ్య గానంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. మురళీ మోహన్ హీరోగా నటించిన ‘కర్పూర దీపం’ సినిమాలో మనో తొలిసారిగా పాట పాడారు. నాటి నుంచి నేటి వరకు 15 భారతీయ భాషల్లో పాటలు పాడి తెలుగులోని దిగ్గజ నేపథ్య గాయకుల్లో ఒకరిగా నిలిచారు.

డబ్బింగ్ ఆర్టిస్ట్‌ గానూ సత్తా చాటిన మనో :

అంతేకాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ మనో మంచి పేరు తెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు గాత్రదానం చేసి.. ఆయన నటించిన సినిమాలు విజయవంతం కావడానికి తన వంతు పాత్ర పోషించారు. కేవలం రజనీకాంత్‌కే కాకుండా కమల్ హాసన్, రఘువరన్, శరత్ కుమార్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్‌లకు కూడా మనో డబ్బింగ్ చెప్పారు. తర్వాతి కాలంలో బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చిన మనో.. పాలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తెలుగునాట పాపులరైన జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, కళ్యాణం కమనీయం షోలకు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇక 1985లో ఆయన జమీలాను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు (షకీరా, రతేష్), ఓ కుమార్తె (సోపికా) సంతానం.