చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం.. రూమర్స్‌ని స్ప్రెడ్ చేయకండి: సింగర్ మాళవిక

  • IndiaGlitz, [Thursday,August 20 2020]

ఓ టీవీ షో షూటింగ్‌కు ముందే తాను కరోనా బారిన పడ్డానంటూ ఓ పేక్ వాట్సాప్ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని ప్రముఖ సింగర్ మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్ట్ 5న ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తరువాత మాత్రమే పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. అంతకు ముందు ఐదు నెలల పాటు తాను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరూ కానీ బయటకు వచ్చింది కూడా లేదన్నారు. తనతో పాటు తన రెండేళ్ల పాప, తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డామని.. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని.. ఇలాంటి సమయంలో రూమర్స్ క్రియేట్ చేయవద్దని ఆమె కోరారు.

ఈ మేరకు మాళవిక ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘జులై 30న ఎస్పీ బాలు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సామజవరగమన’ కార్యక్రమంలో హేమచంద్ర, అనుదీప్, ప్రణవి, లిప్సిక పాల్గొన్నారు. 31న కారుణ్య, దామిని, సత్యయామిని, వాసా పావనితో పాటు నేనూ పాల్గొన్నా. రెండవ రోజు జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న నలుగురు ఫిమేల్ సింగర్స్‌లో నేనూ ఒకదాన్ని. ఒకవేళ నేను పాజిటివ్ అయి ఉంటే మిగిలిన ముగ్గురు ఫిమేల్ సింగర్స్‌తో కలిసి మేకప్ రూమ్‌ని ఎలా షేర్ చేసుకుంటా? నా సోదరి గాయని కాదు.. ఆమె అమెరికాలో ఉంటోంది. అలాంటప్పుడు ఆ షోలో ఆమె ఎలా పాల్గొంటుంది? ఎలా పాడుతుంది? లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నా భర్త వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. నా తల్లిదండ్రులు గడప కూడా దాటలేదు. కరోనా కారణంగా 5 నెలలుగా పని మనిషిని కూడా తీసేశాం. నాకు రెండేళ్ల పాప ఉంది.

గత ఐదు నెలల్లో ఓ రికార్డింగ్ కోసం కానీ షో కోసమో లేదా షూట్ కోసమో బయటకు రాలేదు. ఆగస్ట్ 5న బాలుగారికి పాజిటివ్ అని తెలిసిన వెంటనే పరీక్ష చేయించుకున్నా. 8న రిపోర్ట్ వచ్చింది. మీకోసం ఆ రిపోర్ట్‌ను కూడా అటాచ్ చేస్తున్నా. వెంటనే నేను మా కుటుంబ సభ్యులందరికీ టెస్ట్ చేయించాను. నాకు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన అనంతరం నా తల్లిదండ్రులతో పాటు నా కుమార్తె‌కు కూడా పాజిటివ్ వచ్చింది. నా భర్తకు మాత్రం నెగిటివ్ వచ్చింది. మేము ఈ రోజు మా నాన్నను ఆసుపత్రిలో చేర్పించాము. ప్రస్తుతం మేము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ఫేక్ రూమర్స్‌ను స్ప్రెడ్ చేయవద్దు. నేను సైబర్ క్రైంకి కూడా ఫిర్యాదు చేశాను కాబట్టి ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపై కఠిన చర్యలుంటాయి. ప్రస్తుత తరుణంలో నాకు మీ సపోర్ట్ కావాలి’’ అని సింగర్ మాళవిక పోస్ట్‌లో పేర్కొన్నారు.