కోవిడ్ బారినపడ్డ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. ఐసీయూలో చికిత్స

  • IndiaGlitz, [Tuesday,January 11 2022]

దేశంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వరుస పెట్టి ఒక్కొక్క సినీ ప్రముఖుడు పాజిటివ్‌గా తేలుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, విక్రమ్, మహేశ్ బాబు, కరీనా కపూర్, త్రిష, అరుణ్ విజయ్, వడివేలు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తమన్ , రాజేంద్ర ప్రసాద్ , బండ్ల గణేశ్ వంటి వారు కోవిడ్ బారినపడ్డారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి దిగ్గజ గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ చేరారు. కోవిడ్ లక్షణాలతో ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం లతాజీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆమె మేనకోడలు రచన తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ వృద్ధాప్య సమస్యల కారణంగా లతా మంగేష్కర్‌ను ఐసీయూకి తరలించినట్లు రచన వెల్లడించారు. ఇదిలా ఉండగా సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలకు కరోనా సోకింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కోవిడ్ సోకింది. దీంతో వారు క్వారంటైన్‌లో వుంటున్నారు.

ఇకపోతే గడిచిన 24 గంటల్లో 1,68,063 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో 33 వేలు, ఢిల్లీ, బెంగాల్‌లలో 19 వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కేసులు అధికంగా వున్నాయి. అలాగే దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు వున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,247 మంది ఒమిక్రాన్ బారినపడగా.. రాజస్థాన్ 654, ఢిల్లీలో 546 కేసులు నమోదయ్యాయి.