singer kk death: సింగర్ కేకే హఠాన్మరణం.. చివరి శ్వాస వరకు సంగీతమే ఊపిరిగా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నేపథ్య గాయకుడు కేకే హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. సంగీత ప్రపంచంలో కేకేగా ప్రసిద్ధి పొందిన ఆయన పూర్తి పేరు కృష్ణకుమార్ కున్నాథ్. ఓ ప్రదర్శన నిమిత్తం మంగళవారం కోల్‌కతా వచ్చిన ఆయన నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన అనంతరం హోటల్‌కు చేరుకున్న వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది ఆయనను నగరంలోని సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే కేకే అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి:
మరణానికి ముందు తన ప్రదర్శనకు సంబంధించిన పోస్టులను కేకే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి దాకా తమను అలరించిన కేకే తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో ఆయన అభిమానులు, సంగీత ప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సహా పలువురు ఆయనకు సంతాపం తెలియజేశారు.
ప్రేమ దేశంతో సింగర్‌గా ఎంట్రీ:
న్యూఢిల్లీలో సీఎస్ మీనన్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించిన కృష్ణకుమార్ .. ఢిల్లీ మౌంట్ సెయింట్ మెరీస్ స్కూల్‌లో చదువుకున్నారు. అనంతరం ఆ తర్వాత హోటల్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ అసోసియేట్‌గా కొద్దికాలం పని చేశారు. ఆ తర్వాత సంగీతంపై మక్కువతో ముంబైకి మకాం మార్చారు. 1996లో తమిళ సినిమా కాదల్ దేశం (తెలుగులో ప్రేమదేశం)లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో ‘కల్లూరి సలై’, హలో డాక్టర్’ పాటలు పాడారు. తెలుగులో ‘కాలేజీ స్టైలే’.. హలో డాక్టర్’ పాటలను సైతం ఆలపించగా.. అవి అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి.
మూడు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్:
1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ చిత్రంలో ‘తడప్ తడప్’తో బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు.. అయితే, దీనికి ముందు గుల్జార్ ‘మాచిస్’లోని ‘ఛోడ్ ఆయే హమ్’ పాటలో కొంత భాగాన్ని కేకే పాడారు. తెలుగులో ఇంద్రా, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్, నువ్వేనువ్వే, సైనికుడు, వాసు, ఖుషీ, నువ్వునేను, నా ఆటోగ్రాఫ్, ఆర్య, జల్సా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ కావాలి వంటి సినిమాల్లో కేకే పాటలు పాడారు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో హిందీ, తెలుగు, బెంగాలీ, కన్నడ, మలయాళీ, తమిళ భాషల్లో వందలాది పాటలను పాడారు. ఉత్తమ గాయకుడిగా ఎన్నో అవార్డులను అందుకున్న కేకే తన చిన్ననాటి స్నేహితురాలు జ్యోతికృష్ణను 1991లో పెళ్లాడారు. వారిద్దరికి నకుల్, తామర అనే ఇద్దరు పిల్లలున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout