నెలరోజులుగా ఆసుపత్రిలోనే బప్పిలహరి, మంగళవారం డిశ్చార్జ్... అంతలోనే
- IndiaGlitz, [Wednesday,February 16 2022]
80, 90 దశకాల్లో దేశాన్ని ఉర్రూతలూగించిన బప్పిలహిరి మరణంతో యావత్ దేశం విషాదంలో కూరుకుపోయింది. పలు రకాల అనారోగ్య కారణాలతో ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో బప్పిలహిరి తుదిశ్వాస విడిచారు. గతేడాది కరోనా వైరస్ సోకడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో బప్పిలహరి చేరారు. ఆ తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నెల రోజుల క్రితం మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బప్పిలహరి సిటికేర్ హాస్పిటల్‌లో చేరారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఫిబ్రవరి 15న అంటే నిన్న (మంగళవారం) డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రమాదం లేదు కోలుకున్నారని అంతా భావించిన క్రమంలో ఎవరూ ఊహించని విధంగా బుధవారం తుదిశ్వాస విడిచి సంగీత ప్రియులను విషాదంలోకి నెట్టేశారు. అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే వ్యాధితో బప్పిలహరి మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. గురువారం బప్పిలహరి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించిన బప్పింగ్ లహరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. సంప్రదాయ భారతీయ కుర్తా, షేర్వాణి , పాశ్చాత్య స్వెట్‌షర్టులు, బ్లేజర్స్ ఎక్కువగా ధరిస్తారు. ఇక బంగారమంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ ఒంటినిండా బంగారు ఆభరణాలు, సన్‌గ్లాసెస్‌తో కనిపించేవారు.
బప్పిలహరి మరణంతో ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్‌లో ఈ మేరకు సంతాపం తెలిపారు. భౌతికంగా దూరమైనప్పటికీ.. తన సంగీతంతో ప్రజల మనుసులో చిరస్థాయిగా ఉంటారని మోడీ పేర్కొన్నారు. బప్పి లహిరి కన్నుమూత తీవ్ర ఆవేదనను కలిగించిందన్న చిరంజీవి… తన సినిమాలకు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని, ఆయన లేని లోటు తీర్చలేదనిదని’ ట్విట్ చేశారు. బప్పి లహరి మరణంపై నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసిందని... ఈ రోజు బప్పిలహరి మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమన్నారు.