Silly Fellows Review
2012లో అల్లరి నరేశ్, భీమనేని శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన `సుడిగాడు` చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు నరేశ్. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమా చేయలేదు. ఇద్దరికీ ఆశించిన మేర హిట్ మాత్రం లేదు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారనగానే ఏ సినిమా చేస్తారోనని ఆసక్తి మొదలైంది. అయితే భీమనేని తన మార్కు రీమేక్ చేయడానికే ఆసక్తి చూపారు. మరో విషయమేమంటే.. ఈ సినిమాతో సునీల్ మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడం.. ఆరేళ్ల తర్వాత హిట్ కాంబినేషన్‌లో సినిమా రావడం.. సునీల్ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చి చేసిన సిమా కావడం వల్ల `సిల్లీ ఫెలోస్`పై అంచనాలు పెరిగాయి. మరి సిల్లీ ఫెలోస్ ఎలా ఉన్నారో చూద్దాం...
కథ:
వీరబాబు(అల్లరి నరేశ్) లేడీస్ టైలర్.. ఇతని స్నేహితుడు సూరిబాబు(సునీల్). లేడీస్ టైలర్‌గా ఉండి ఎమ్మెల్యే అయిన జాకెట్ జానకిరామ్(జయప్రకాశ్ రెడ్డి) బాటలోనే వీరబాబు నడవాలనుకుంటాడు. తనని మంచి చేసుకోవడానికి స్నేహితుడు సూరిబాబుకి, పుష్ప(నందినీ రాయ్)కి పెళ్లి జరిపించేస్తాడు. అప్పటికే పుష్పవల్లి(పూర్ణ)తో ప్రేమలో ఉన్న సూరిబాబు.. తన నిజాయతీని నిరూపించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటాడు. వాసంతి(చిత్రా శుక్లా)ని ప్రేమించిన వీరబాబు.. ఆమెను ప్రేమలో దింపే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఓసారి వాసంతి తల్లి వాసంతిని ఇన్‌స్పెక్టర్ చేయడానికి పది లక్షల రూపాయలు లంచం ఇస్తుంది. వీరబాబు ఆ డబ్బును తీసుకెళ్లి జానకిరామ్‌కి ఇస్తాడు. అదే సమయంలో మినిష్టర్ చావబ్రతుకుల మధ్య ఉండి తన వద్ద ఉన్న ఐదు వందల కోట్ల రూపాయల వ్యవహారాన్ని జానకిరామ్‌కి చెప్పి చనిపోతాడు. దాంతో మినిష్టర్ బావ మరిది(పోసాని కృష్ణమురళి).. డబ్బు కోసం జానకిరామ్ వెంట పడతాడు. అయితే జానకి రామ్ అనుకోకుండా ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతాడు. చివరకు జానకిరామ్‌కి స్పృహ వస్తుందా? వీరబాబు, వాసంతి ప్రేమ ఏమవుతుంది? జానకిరామ్‌కి తెలిసిన 500 కోట్ల రూపాయల వ్యవహారాన్ని అతని బావ మరిది తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్లు:
- నరేష్, సునీల్ నటన
- జె.పి. పోసాని పాత్రలు
- అక్కడక్కడా కామెడీ
- కెమెరా
మైనస్ పాయింట్లు:
- కంగాళీగా అనిపించే స్క్రీన్‌ప్లే
- రొటీన్ కథ
- ఆకట్టుకోని మ్యూజిక్
- ఎడిటింగ్ లోపం
విశ్లేషణ:
తెలుగు సినిమా కొత్త స్టయిల్ కథ, కథనాలతో ప్రేక్షకులనే కాదు.. ఇతర సినిమా రంగాల వారిని ఆకట్టుకుంటుంటే.. భీమనేని వంటి సీనియర్ దర్శకులు ఇంకా రీమేక్‌లపైనే ఎందుకు ఆధారపడాలో అర్థం కావడం లేదు. కొత్త కథను తయారు చేసుకోవచ్చు కదా.. అనిపిస్తుంది. పన్నెండు సినిమాలు సరైన హిట్ లేని నరేశ్‌కు సునీల్ కామెడీతో లక్‌ను అందించే ప్రయత్నం చేసినా.. అది బెడిసి కొట్టింది. పుష్ప మొగుడు అనే పాత్రలో సునీల్ కామెడీ అక్కడక్కడా కాస్త నవ్వులు పూయించింది. ఇక నరేశ్ ఎప్పటిలా కామెడీతో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం బోల్తా కొట్టింది. తమిళంలోని కామెడీ తెలుగులో పండలేదు. జయప్రకాశ్ రెడ్డి పాత్ర, అందులో కామెడీ.. అలాగే పోసాని విలనిజం, అదుర్స్ రఘు కామెడీ అన్ని నవ్వులు పూయించలేదు. కథలో జయప్రకాశ్ కోమాలోకి వెళ్లిపోవడం.. మళ్లీ కోమా నుండి బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయడం.. మధ్యలో హీరో తన ప్రేమలో నిజాయతీని నిరూపించుకునే ప్రయత్నాలు.. మరోవైపు సునీల్ పుష్ప నుండి విడాకులు తీసుకోవడమే లక్ష్యం చేసే పరుగు.. ఇవన్నీ కంగాళీగా తయారైయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ మరీ అధ్వానంంగా ఉంది. ఇక నరేశ్ సినిమాలంటే ప్రేక్షకులు పోస్టర్ చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చేస్తుందేమోననిపిస్తుంది. నరేశ్ కొత్త ప్రయత్నాలు చేయకపోతే కష్టమే సుమీ!. హీరోయిన్ చిత్రా శుక్లా గ్లామర్‌గానే ఉన్నా.. ఆమెకు లక్ కలిసి రావడం లేదు. ఇక పూర్ణ చాలా చిన్న పాత్రలో నటించింది. పుష్ప పాత్రలో నందినీ రాయ్ ఓకే అనిపించింది. అనీష్ తరుణ్‌కుమార్ కెమెరా వర్క్ బాగా ఉంది. డిజె.వసంత్ కంపోజ్ చేసిన రెండు పాటలు, నేపథ్య సంగీతం బాగా లేదు. ఎడిటింగ్ బాగా లేదు. మొత్తంగా మంచి కథ ఉంటే సినిమా చేయాలి కానీ.. డిస్ట్రిబ్యూటర్స్ ఏదో చెప్పారు కదా! అని సినిమా చేయకూడదని ఈ సినిమా చేసిన తర్వాత నరేశ్, భీమనేని అండ్ గ్యాంగ్‌కి అర్థమై ఉంటుంది. తమిళ చిత్రాన్ని ఆల్ రెడీ తెలుగులో డబ్ చేశారు. మళ్లీ దీన్ని తెలుగులో రీమేక్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు.
బోటమ్ లైన్: సిల్లీ ఫెలోస్.. టైటిల్‌కు న్యాయం చేశారుగా!
Read Silly Fellows Movie Review in English
- Read in English