చెన్నైలో ఉండి బతికిపోయాడు.. సంగీత దర్శకుడిపై డైరెక్టర్ ఫైర్..

  • IndiaGlitz, [Thursday,February 22 2024]

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ రథన్ మీద తెలుగు దర్శకుడు యశస్వి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'సిద్ధార్థ్ రాయ్' అనే మూవీకి యశస్వి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి రథన్ మ్యూజిక్ అందించారు. తాజాగా నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ ఓ సినిమాను చంపేస్తున్నాడంటూ రథన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయం అందరికీ తెలియాలి.. ఇంకెవ్వరూ తనలా మోసం పోవద్దు.. సినిమాను చంపేయాలని చూస్తుంటాడు.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.. రధన్ వల్లే ఈ సినిమా ఇంత ఆలస్యం అయింది.. ఎప్పుడు అడిగినా అపాయింట్‌మెంట్ ఇచ్చేవాడు కాదు.. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతోంది. అతను గొడవ పడటానికే మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మ్యూజిక్ సిట్టింగ్‌ల సందర్భంగా ఓరోజు రాజమండ్రిలో ఉండగా అతను ఫోన్ చేశాడు.. వైజాగ్ వచ్చే వరకు ఆ ఫోన్ కాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఎంతలా ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుందో అర్థం చేసుకోండి. సినిమాను ఓ మూలకు తీసుకెళ్లి పడేస్తాడు.. రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడు.. ఇక్కడే ఉంటే చాలా గొడవలు అయ్యేవి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

అంతేకాకుండా గతంలో అర్జున్ రెడ్ది సమయంలో ఆ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి.. రధన్ గురించి మాట్లాడిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.అర్జున్ రెడ్డి మూవీ సమయంలో ఇప్పటికప్పుడు సినిమాను వదిలేస్తే ఏం చేస్తావ్ అని చాలా రూడ్‌గా అన్నాడు అంటూ సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెబుతాడు. దీంతో ఇప్పుడు యశస్వి, సందీప్ మాట్లాడిన మాటలు మళ్లీ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మన దగ్గర తెలుగు సంగీత దర్శకులు చాలా మంది ఉండగా.. తమిళ వాళ్లను ఎందుకు తీసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి రధన్ పరిచమయ్యాడు. ఆ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడంతో రథన్ పేరు మార్మోగింది. అనంతరం అర్జున్ రెడ్డి, హుషారు, జాతిరత్నాలు, పాగల్ వంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. అయితే ఎంత ప్రతిభ ఉన్నా కానీ తన రూడ్ బిహేవియర్‌తో వివాదాస్పద మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక సిద్ధార్థ్ రాయ్ సినిమా విషయానికొస్తే ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి తరహాలోనే ఇందులో హీరో క్యారెక్టర్ వైల్డ్‌గా ఉంది. ఇందులో హీరో పాత్రలో అతడు మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ నటించాడు. ఫిబ్రవరి 23న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.