15లక్షల మందితో 'సిద్ధం' సభ సూపర్ సక్సెస్.. ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు..

  • IndiaGlitz, [Monday,March 11 2024]

అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. సీఎం జగన్‌ కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఎటూ చూసినా జనమే.. ఇసుకేస్తే రాలనంతం జనం. జనసునామీతో ఆ ప్రాంతంతా సముద్రంలా కనపడింది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ సీఎంను చూసేందుకు..ఆయన ప్రసంగం వినేందుకు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి సిద్ధం సభకు చేరుకున్నారు. దాదాపు 15 లక్షల మంది సభకు వచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ సభలో జగన్ మాట్లాడుతూ ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహం అని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు.

తనకు ఉన్నదల్లా, నక్షత్రాలు ఉన్నన్ని పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ప్రతి గడపలో ఉన్నారన్నారు. నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని.. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, చంద్రబాబు జేబులో మరో జాతియ పార్టీ, వీరంతా తనపై దాడి చేయటానికి రెడీగా ఉన్నారని విమర్శించారు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటతో కూడా పోటి పడలేకపోయాయంటూ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని విడగోట్టిన పార్టీ, ప్రజల చేతిలో చిత్తుగా ఒడిపోయిన పార్టీలు, ఇటువంటి వారందరు మనకు పోటీగా వస్తున్నారన్నార. ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్న తనకు ఉన్నది కేవలం ప్రజా మద్దతు అని, వారే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని పేర్కొన్నారు. వైసీపీ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని.. చంద్రబాబు మ్యానిఫెస్టోకు శకుని చేతిలోని పాచికలకు తేడా లేదని విమర్శలు చేశారు.

ఈ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ప్రతిపక్ష టీడీపీ నేతలు ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గ్రీన్ మ్యాట్స్, గ్రాఫిక్స్ అంటూ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్ధంకి సభ సూపర్ సక్సెస్ అయిందని.. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారని చెబుతున్నారు. సభ అనంతరం తమ వాహనాల్లో తిరుగు ప్రయాణమై వెళ్తున్న జనం వీడియోను వైసీపీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. జగనన్న మీద అభిమానంతో వచ్చిన వైసీపీ సైన్యం అంటూ పేర్కొంది.

ఇదిలా ఉంటే ఈ సభకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావడంతో సభా ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. వేదిక వద్ద నుంచి సీఎం జగన్ వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా మరొకరు అస్వస్థతకు గురయ్యారు. మృతుడు ఒంగోలులోని బలరాం కాలనీకి చెందిన ఉదరగుడి మురళి(30)గా గుర్తించారు. ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దీనిపై స్పందించిన జగన్.. మృతుడి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మొత్తానికి వైసీపీ చివరి సిద్ధం సభతో ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.