Siddaramaiah:కేసీఆర్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సిద్ధరామయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర - బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ... అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పరిపాలన అవినీతితో కూరుకుపోయిందని.. అందుకే బీఆర్ఎస్ను ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది అంతే సత్యమన్నారు. ప్రధాని మోదీ రెండుసార్లు తెలంగాణకు వచ్చిపోయినప్పటికీ... బీజేపీ అభ్యర్థులు ఇక్కడ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేసీఆర్ చెబుతున్నారని కానీ కర్ణాటక వస్తే చూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు. కామారెడ్డి తీర్పు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కేసీఆర్ ఏ రోజూ సచివాలయానికి రాలేదని.. కామారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ఎదుటే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు. గజ్వేల్లో బాగా చేసి ఉంటే కామారెడ్డికి ఎందుకు వస్తావ్ అని రేవంత్ ప్రశ్నించారు. అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తానంటే కామారెడ్డి ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. కామారెడ్డి చుట్టూ ఉన్న భూములపై కేసీఆర్ కన్ను పడిందని అందుకే ఇక్కడకు వచ్చారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేను అవ్వాలంటే తనను ఎక్కడైనా ప్రజలు గెలిపిస్తారని కానీ కేసీఆర్ను రాజకీయంగా బొంద పెట్టాలనే ఉద్దేశ్యంతోనే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout