Shylock Review
సినిమా థియేటర్స్ లేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలు మినహా మిగతావన్నీ ఓటీటీలో విడుదలవుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలన్నీ ఓటీటీ మాధ్యమంలో విడుదలయ్యాయి. ఆ క్రమంలో తెలుగులో విడుదలైన మలయాళ డబ్బింగ్ సినిమా షైలాక్. తెలుగు కంటెంట్ ఓటీటీ ఆహాలో విడుదలైంది. అసలు షైలాక్ అంఏ వడ్డీలకు డబ్బు ఇచ్చే కఠోరమైన మనసున్న వ్యక్తి. విలియం షేక్స్‌పియర్ నవల్లోని ఓ కల్పిత పాత్ర. అలాంటి పాత్రకు ఈ సినిమాకు సంబంధమేంటి? సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం.
కథ:
బాస్(మమ్ముట్టి) సినిమా రంగంలోని నిర్మాతలకు డబ్బులిచ్చే ఫైనాన్సియర్. బాస్ దగ్గర దాదాపు అందరూ నిర్మాతలు డబ్బులు తీసుకుని, తిరిగివ్వమని అడగడానికి ఫోన్ చేసినప్పుడు ముఖం చాటేస్తుంటారు. అలాంటి నిర్మాతలను బాస్ వెతికి మరీ పట్టుకుని వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటాడు.డబ్బులు ఇవ్వలేని వారి వద్ద. అంతకు ముందు ప్రామీసరీ నోట్‌లో వారు రాసిచ్చిన ఆస్థులను జప్తు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ప్రతాప్ వర్మ కూడా బాస్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు కానీ తిరిగివ్వడు. దాంతో బాస్ ప్రతాప్ వర్మ ఉండే లొకేషన్‌లోకి వచ్చి తన డబ్బులు తనకు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చి వెళతాడు. దాంతో ప్రతాప్ వర్మ పరువు పోయినట్లుగా భావిస్తాడు. తన స్నేహితుడైన కమీషనర్ (సిద్ధిఖీ) సాయంతో బాస్‌ను అరెస్ట్ చేయించాలనుకుంటాడు ప్రతాప్ వర్మ. కానీ బాస్‌ను ఎవరూ ఏమీ చేయలేకపోతుంటారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా బాస్ వాటిని చిత్తు చేసి ముందుకు సాగిపోతుంటాడు. ఓసారి ఓ ప్లాన్ వేసి బాస్‌ను ఇరికించాలని ట్రై చేసిన ప్రతాప్ వర్మ కొడుకుని చంపేస్తాడు బాస్. అప్పుడు ప్రతాప్ వర్మ ఏం చేస్తాడు? అసలు బాస్ ఎవరు? బాస్ అసలు పేరేంటి? అతని వెనుకున్న కథేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
మలయాళ చిత్ర సీమ పక్కా కమర్షియల్ సినిమాల వైపు అడుగు లేయడం ప్రారంభించింది. సాధారణంగా స్టార్ హీరోలైనా కూడా కంంటెంట్, లాజిక్స్ మిస్ కాకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా క్రమంగా పక్కా కమర్షియల్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. అందుకు బెటర్ ఎంగ్జాంపుల్‌గా షైలాక్ సినిమాను చూపించవచ్చు. ఏడు పదుల వయసుకు దగ్గర పడుతున్న మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా గురించి సింగిల్ లైన్‌లో చెప్పాలంటే రివేంజ్ డ్రామా. పోనీ ఈ రివేంజ్ ఏమైనా ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు ట్విస్టులు, ట్రెండులతో ఏమైనా సాగిందా అంటే పాత తెలుగు సినిమాల్లోని రొటీన్ రివేంజ్ ఫార్ములాగా అనిపించింది.
సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ ముగిసే వరకు హీరో బిల్డప్‌లతోనే సినిమా సాగుతుందంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమాలో మమ్ముట్టి యాక్షన్ సీన్స్‌లో బాగానే చేసినా.. కొన్ని సీన్స్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన సీనియర్ అయిపోయాడనే చెబుతుంది. హీరో ఫైనాన్సియర్.. అతన్ని ఓ సిటీ పోలీస్ కమీషనర్ ఏమీ చేయలేడు అనేలా ఓ భారీ బిల్డప్ ఇచ్చారు. పోనీ అందుకు తగినట్లు సన్నివేశాలున్నాయా? అంటే అలాంటివేమీ కనపడవు. ఇంతకు ముందు చెప్పినట్లు హీరో డైలాగ్స్‌కు, ఆయన ఇమేజ్ ఇంత అని చెప్పేందుకు ఫస్టాఫ్‌ను తీసినట్లు ఉంది.
ఇంత బిల్డప్ వెనుక హీరో రివేంజ్.. పాత తెలుగు సినిమా స్టయిల్లో. ఇక క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గన్ ఉండే కమీషనర్.. హీరోను చంపాలనుకున్నప్పుడు కాల్చాలి కానీ.. హీరో తనపై ఎప్పుడు దాడి చేస్తాడా? అని వెయిట్ చేస్తుంటాడు. అదేంటో అర్థం కాదు.రాజ్‌కిరణ్, మీనా, సిద్ధిఖీ మినహా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలేవీ లేవు. ఇక కమర్షియల్ ఫార్ములాలో సినిమాను ఎడిట్ చేయడానికి ఎడిటర్ బాగానే కష్టపడ్డాడు. అయితే ప్రయత్నం ఫలించలేదు. కెమెరా పనితనం ఓకే. ఇక సంభాషణల తెలుగు అనువాదం బాగోలేదు. గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. ఇక పాటలు చూస్తే ఏదో సీనియర్ బ్యాచ్ చేరి డాన్సులేస్తున్నట్లు అనిపిస్తుంది.
బోటమ్ లైన్: షైలాక్... మమ్ముట్టి వీరాభిమానులకే
- Read in English