‘సలార్’ కోసం శ్రుతి హాసన్ ఎంత డిమాండ్ చేసిందంటే..

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శ్రుతి హాసన్.. ఆ తరువాత తండ్రి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలుత ఐరన్ లెగ్ అని టాక్ ఉన్నప్పటికీ దానిని సైతం చెరపేసుకుని అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగు, తమిళ భాషలకు చెందిన స్టార్ హీరోలతో నటించింది. వ్యక్తిగత కారణాలతో దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరమైన శ్రుతి ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది. వరుసగా సినిమాలు చేస్తోంది.

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో శ్రుతి హాసన్ మంచి హిట్ కొట్టింది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ సినిమాలో శ్రుతి హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందంటూ టాక్ వినిపిస్తోంది. ‘సలార్‌’ చిత్రంలో నటించేందుకు ఆమె ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్‌ చేసినట్టు కోలీవుడ్‌‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.

ఈ ప్రాజెక్టుతో రెండేళ్ళ క్రితం ఉన్న తన మార్కెట్‌ను తిరిగి దక్కించుకోవాలన్న ఆలోచనలో శృతిహాసన్‌ ఉన్నట్టు వినికిడి. ఈ భారీ ప్రాజెక్టుతో పాటు మరికొన్ని చిత్రాల్లో అవకాశం దక్కించుకునే పనిలో శ్రుతి ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ గోదావరి ఖనిలో ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే గోదావరిఖనిలో భారీసెట్‌ వేసినట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.