BiggBoss: చీకటి గదిలో చితక్కొట్టుడు... వణికిపోయిన శ్రీహాన్- ఆదిరెడ్డి, జనానికి ఫన్

  • IndiaGlitz, [Thursday,December 08 2022]

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు లేకపోయినా.. అనుకున్న స్థాయిలో కంటెంట్ రాకపోయినా ఇప్పటి వరకు ఏదోలాగో లాక్కొచ్చింది బిగ్‌బాస్ టీం. అయితే చివరి రెండు వారాలు ఎలా మేనేజ్ చేయాలో అర్ధం కాక షోను మరీ సాగదీస్తున్నట్లుగా అనిపిస్తోంది. రసవత్తరమైన టాస్కులతో ఆటను రక్తికట్టించాల్సిందిపోయి సోది టాస్కులిస్తూ చికాకు పుట్టిస్తున్నాడు. ప్రైజ్‌మనీని వెనక్కి తెచ్చుకునే టాస్కులు కొన్నిసార్లు చప్పగా, మరికొన్ని సార్లు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి.

రెండు రోజుల నుంచి జరుగుతున్న వివిధ టాస్కుల్లో కంటెస్టెంట్స్ కొంత మొత్తం గెలవడంతో విన్నర్ ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరుకుంది. ఈ రోజు ఎపిసోడ్‌లో ఐదో టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఎప్పటిలాగే ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో రోహిత్- ఆదిరెడ్డిలు ఆడతారని చెప్పారు. మిగిలిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు ఇచ్చి... ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వారి పక్కన నిల్చోమన్నారు. ఈ క్రమంలో శ్రీసత్య ఒక్కతే రోహిత్‌కు సపోర్ట్ చేయగా.. మిగిలిన నలుగురు ఆదిరెడ్డి వైపే మొగ్గుచూపారు. దీంతో టాస్క్‌లో ఆదిరెడ్డి గెలిస్తే రూ.80 వేలు ప్రైజ్‌మనీలో కలుస్తుంది. ఒకవేళ రోహిత్ గెలిస్తే రూ.20 వేలు మాత్రమే కలుస్తుంది. గేమ్‌లో ఆదిరెడ్డి గెలిచాడు.

తర్వాతి టాస్క్‌లో శ్రీహాన్- కీర్తి మధ్య పోటీ జరగ్గా.. ఇంటి సభ్యులంతా శ్రీహాన్‌కే సపోర్ట్‌‌గా నిలిచారు. హౌస్‌మేట్స్ నమ్మకం నిజమై శ్రీహానే గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు కలిసింది. ఈ టాస్క్‌లో కుండలు పగిలి మట్టి కిందపడటంతో శ్రీసత్య, ఇనయా, కీర్తిలు ఎగబడి తిన్నారు. దీంతో మట్టి రుచి అంత బాగుందా... ఇక నుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపితే చాలు అని బిగ్‌బాస్ ఆటపట్టించాడు.

ఆ తర్వాత ఇంటి సభ్యులకు డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు. పిలిచినప్పుడు కన్ఫెషన్ రూమ్‌కి రావాలని.. అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు సంపాదించుకోవచ్చని బిగ్‌బాస్ తెలిపాడు. తొలుత ఆదిరెడ్డిని పిలవగా.. గదంతా చీకటిగా ... ఎముకలు, దెయ్యాలు, పాములతో రకరకాల సౌండ్‌లు వినిపించాయి. రండి ఆదిరెడ్డి.. గదిలో వున్న కొవ్వొత్తిని వెతకండి అని బిగ్‌బాస్ ఆదేశించగా.. తన వల్ల కాదన్నాడు. దీంతో అతనికి మరో ఆప్షన్ ఇచ్చాడు. బయట వున్న ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరి సహాయం తీసుకోవచ్చని చెప్పగా... శ్రీహాన్‌ కావాలని అన్నాడు. ఈ మాట వినగానే శ్రీహాన్‌కు పై ప్రాణాలు పైనే పోయాయి. చీకటి గదిలోకి అడుగుపెట్టిన తర్వాత క్యాండిల్‌తో పాటు గన్‌ను వెతకాల్సిందిగా బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శ్రీహాన్, ఆదిరెడ్డిలు వణికిపోయారు.

అరుపులు, కేకలతో పాటు ఆ గదిలో అప్పటికే వున్న కొందరు దెయ్యాల మాదిరిగా ముసుగులు ధరించి వారిద్దరిని మరింత భయపెట్టారు. దీంతో తనకు ఏమైనా అయితే తన శవాన్ని మోసుకుని పోవాలని ఆదిరెడ్డి కేకలు పెట్టాడు. ఎంత ధైర్యంగా వుందామని ట్రై చేసినా వీరిని ఏదో రకంగా భయపెట్టాడు బిగ్‌బాస్. ఇక వీరిద్దరి పర్ఫార్మెన్స్‌ని బయట వున్న కంటెస్టెంట్స్ చూసి నవ్వుకున్నారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి కొవ్వొత్తి, గన్ సాధించడంతో హమ్మయ్య అనుకున్నారు. మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్ ముగిసే సరికి ప్రైజ్ మనీ రూ. 44,35,100కి చేరుకుంది. మరి రేపటి ఎపిసోడ్ నాటికైనా రూ.50 లక్షల మార్క్ చేరుకుంటారో లేదో చూడాలి.