స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణం , నోటీసులిచ్చినా మారని యాజమాన్యం
Send us your feedback to audioarticles@vaarta.com
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోరానికి కారణం ఏంటన్న దానిపై అగ్నిమాపక శాఖ దర్యాప్తు చేస్తోంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. గురువారం రాత్రి 7 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని.. ఆ వెంటనే తమ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని ఆయన తెలిపారు. లోపల చిక్కుకున్న 12 మందిని రక్షించామని, కానీ దురదృష్టవశాత్తూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని నాగిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గతంలోనే కాంప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు :
అయితే స్వప్నలోక్ కాంప్లెక్స్ యజమానులకు ఫైర్ సేఫ్టీ గురించి ముందే హెచ్చరించామని.. కానీ వారి నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి కారణమైందన్నారు. ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఫైర్ ఫైటింగ్ సిస్టం వుండాలని.. వాటి నిర్వహణ కూడా గమనించాలని నాగిరెడ్డి హెచ్చరించారు. కాగా.. కాంప్లెక్స్‌ను లాక్ చేసి వుంచడం కూడా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందన్నారు. నిర్వహణకు సంబంధించి ఇప్పటికే స్వప్నలోక్ కాంప్లెక్స్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చామని.. మెట్ల దారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ లాక్ చేయకూడదని నాగిరెడ్డి పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా :
మరోవైపు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఆరుగురికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంతో భవిష్యత్ వున్న పిల్లలు ఈ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. మృతులంతా 22, 23 ఏళ్ల లోపు వారేనని మంత్రి తెలిపారు. నిబంధనలు పాటించని బిల్డింగ్‌లు, గోడౌన్‌లు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments