టాలీవుడ్‌కు త్వరలో మంచి రోజులొస్తాయ్.. : మంత్రి తలసాని

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

టాలీవుడ్ ఇండస్ట్రీకి త్వరలోనే మంచి రోజులొస్తాయని సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మంగళవారం నాడు నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఇండస్ట్రీకి శుభవార్త చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, సినిమా థియేటర్లను కూడా బంద్ చేసేశారు. దీంతో నిర్మాతలు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు కమిట్మెంట్ ఇచ్చిన నటీనటులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ టాలీవుడ్ పెద్దలతో సమావేశం అయిన తలసాని పలు విషయాలపై నిశితంగా చర్చించారు. అనంతరం మీడియా మీట్ నిర్వహించారు.

సీసీసీ శుభపరిణామం..

‘ఇండస్ట్రీలో అందరికీ ఇబ్బంది, నష్టం ఉన్న విషయం నిజమే. త్వరలోనే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయి. సినిమాలపైనే ఆధార పడ్డ కార్మికులకు రేషన్ కార్డ్ లున్నాయి. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ శుభ పరిణామం. ఈ ట్రస్ట్ ద్వారా 14 వేల మందిని ఆదుకున్నారు. సినిమా పెద్దలతో మీటింగ్‌లు జరిగాయి. కరోనాతో బ్రేక్ పడింది కానీ బెస్ట్ పాలసీతో ముందుకు వస్తాం. లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ పెద్దలతో మళ్లీ చర్చలు జరుపుతాం. లాక్ డౌన్ తర్వాత సెటిల్ అవడానికి టైం పడుతుంది. లాక్ డౌన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ముందుకు వెళ్తాం. సింగిల్ విండో పాలసీతో ముందుకెళ్తాం. షూటింగ్ విషయంలో ఒక నిర్ణయం తప్పకుండా తీసుకుంటాం. జూన్ నుంచి షూటింగ్‌లు మొదలయ్యే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి ఓ మంచి నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. కాగా.. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)- మ‌న‌కోసం’.. సినీప‌రిశ్రమ 24 శాఖ‌ల్లోని వారికి నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.