కోడెల ఆత్మహత్యకు ముందు సన్నిహితులతో షాకింగ్ విషయాలు!
- IndiaGlitz, [Monday,September 16 2019]
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ కీలక నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన.. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచారు. కోడెల ఇకలేరన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, సన్నిహితులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు.
అసలేం జరిగింది.. కోడెల ఏం చెప్పారు?
ఇదిలా ఉంటే.. ఆత్మహత్యకు ముందు కోడెల తన సన్నిహితులతో కొన్ని విషయాలు చెప్పి కంటతడిపెట్టినట్లు వారు చెబుతున్నారు. కోడెల తమతో చెప్పిన విషయాలు మీడియా ముందుకొచ్చి చెప్పి తీవ్ర భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు. ‘మనోస్థైర్యం దెబ్బతిన్నట్టు...
మానసికంగా కుంగిపోతున్నట్టు కోడెల కనిపించారు. రాజకీయం కోసం ఇంత దిగజారుతారని.. వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి దుర్మార్గాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ పలుసార్లు మాతో చెప్పి ఆయన వాపోయారు.
పల్నాటి పులిగా.. దూకుడైన రాజకీయానికి, తెగువకు మారు పేరు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడని రాజకీయాల్లో ముద్ర వేసుకున్నారు. కొన్నాళ్లుగా పరిస్థితులు తారుమారయ్యాయి. కేసులు, వేధింపులు, ఎక్కువవయ్యాయంటూ కోడెల మాకు చెప్పి ఆవేదన వ్యక్తం చశారు. దర్యాప్తు పేరుతో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని డీలాపడ్డారు’ అని తమతో కోడెల చెప్పారని సన్నిహితులు చెప్పి కంటతడిపెట్టారు.
నిద్రమాత్రలు తీసుకుని!
‘కొడుకు, కూతురుపై ఆరోపణలతో కోడెల మనస్తాపం చెందారు. కొడుకు, కూతురు రాజకీయ సెటిల్‌మెంట్లు చేశారన్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి. తలవంపులు వచ్చాయని, ఇలాంటి పరిస్థితి తన జీవితంలో వస్తుందని అనుకోలేదని తమతో చెప్పి కోడెల వాపోయారు. కొద్దికాలం కిందట హార్ట్ స్ట్రోక్‌తో ఆరోగ్యం విషమించింది. అప్పట్లో ఆయన నిద్రమాత్రలు తీసుకున్నారు. రెండు మూడువారాల్లోనే మరోసారి కోడెల ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంతటి రాజకీయ వేధింపులు, వెంటాడే పరిస్థితులు.. రాజకీయంగా నేనెప్పుడు ఊహించలేదు’ అని కోడెల చెప్పారు.
ఇదిలా ఉంటే.. ‘పల్నాటి పులికి అప్పుడే నూరేళ్లు నిండియా’..‘పోరాటం ఇంత అర్ధాంతంగా ముగిసిపోయిందా’ అని పల్నాడు ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. కాగా రేపు ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.