తెలంగాణ కరోనా టెస్టులు, ట్రీట్మెంట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
- IndiaGlitz, [Saturday,June 20 2020]
రాష్ట్రాలన్నీ ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్మెంట్ విధానంతో ముందుకు సాగుతుంటే.. తెలంగాణలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తెలంగాణ పెద్ద మూల్యాన్నే చెల్లించుకుంటోందని నిపుణులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో టెస్టులు పెద్దగా జరగట్లేదని నిన్న మొన్నటి వరకూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. దీంతో ప్రస్తుతం కాస్త కరోనా పరీక్షలపై తెలంగాణ సర్కార్ దృష్టి సారిచింది. పరీక్షలు కాస్త పెద్ద మొత్తంలో జరుగుతుండటంతో కేసుల సంఖ్య కూడా ఈ మధ్య బాగానే పెరిగింది.
ఈ నేపథ్యంలో ఓ విస్తుగొలిపే విషయం వెలుగు చూసింది. మరే రాష్ట్రంలోనూ లేనంత పాజిటివ్ రేటు మన రాష్ట్రంలో నమోదవుతుండటం గమనార్హం. ప్రతి వందలో సుమారు 19 మందికి వైరస్ పాజిటివ్ అని తేలుతుండటంతో అధికారులు షాక్ అవుతున్నారు. దీనికి కారణం.. వైరస్ లక్షణాలున్నా కాంటాక్ట్ హిస్టరీ లేదని టెస్టులు చేయకుండా వదిలేయడం.. కనీసం ప్రైమరీ కాంటాక్టుల విషయంలో కూడా శ్రద్ధ వహించకపోవడంతో తెలంగాణలో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో వైరస్ కట్టడికి ఫ్రంట్ లైన్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్‌మెంటూ కరోనా కారణంగా అల్లాడుతోంది. మరొక షాకింగ్ న్యూస్ ఏంటంటే.. దేశంలో అత్యధికంగా కేసులు నమోదైన మహారాష్ట్రలోనే పాజిటివ్ రేటు 16.5గా ఉంటే.. తెలంగాణలో మాత్రం ఈ నెల రోజుల్లో 18.51శాతం పాజిటివ్ రేట్ నమోదైంది.
ఇదిలా ఉంటే.. ట్రీట్మెంట్ విషయంలో కూడా ప్రభుత్వం పట్టించుకున్నది లేదు.. వైద్యులు కూడా ప్రభుత్వానికి తగ్గట్టే నడుచుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల రెండు, మూడు కేసుల విషయంలో వైద్యుల నిర్లక్ష్యం వెల్లడైంది. దీంతో బాగా డబ్బున్నవాళ్లు కార్పోరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. కాస్త అవగాహన అవకాశం ఉన్నవారు ఇంట్లోనే సొంత వైద్యంతో కరోనాను జయించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుపేదలే ఒకరకంగా సరైన కాలంలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. దీనిలోనూ విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది మాకు ట్రీట్మెంట్ అందించండి మహాప్రభో అని మొత్తుకున్నా పట్టించుకునే దిక్కు లేకపోవడం.
నిజానికి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఆ వ్యక్తిని ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలించాలి లేదంటే.. సదరు హోమ్ పేషెంట్‌కి ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉంటే వైద్యపరమైన సలహాలు ఎప్పటికప్పుడు అందించాలి. ఆ ఏరియా మొత్తం శానిటైజ్ చేయాలి కానీ ప్రస్తుతం అసలు అధికారులు ఆ ఏరియా వైపు కూడా చూస్తున్న పాపాన పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వృద్ధ దంపతులకి కరోనా పాజిటివ్ అని తేలింది. తమని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించండి మహా ప్రభో అంటూ వైద్యాధికారులను, జీహెచ్ఎంసీ వారిని, 108 సిబ్బందిని వారు వేడుకున్నారు. కానీ వారిని ఎవరూ పట్టించుకోలేదు. చివరకు విషయం జీహెచ్ఎంసీ మేయర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు ఆ వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు. ఇదీ తెలంగాణ పరిస్థితి.