Krishna, Krishnam Raju:కళామతల్లీకి కడుపు కోత : నెలల వ్యవధిలో దివికేగిన ముగ్గురు... రేపటి తరానికి స్పూర్తి ప్రదాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు కళామతల్లీ తన బిడ్డలను ఒక్కొక్కరిగా కోల్పోతూ తల్లడిల్లుతోంది. 2022వ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమాత్రం అచ్చి రాలేదు. పలువురు నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులు ఈ ఏడాది కన్నుమూశారు. వీరిలో కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణల మరణాలు ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి కలిగించాయి. ఈ ముగ్గురు మహానటులు తెలుగు తెరపై వేసిన ముద్ర అనన్య సామాన్యం. టాలీవుడ్ ఇప్పుడు ఈ స్థాయిలో వుండటానికి కారణమైన వారిలో వీరి పాత్ర కూడా కీలకమైనదే. తెలుగు సినీ స్వర్ణ యుగానికి ప్రతినిధులుగా వున్న ఈ ముగ్గురు మనల్ని విడిచి వెళ్లడం దురదృష్టకరం.
సెప్టెంబర్‌లో కన్నుమూసిన రెబల్ స్టార్ :
సెప్టెంబర్ 11న రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే.
ఇండస్ట్రీకి షాకిచ్చిన కృష్ణ మరణం:
ఈ విషాదం నుంచి తేరుకోకముందే .. నవంబర్ 15న సూపర్‌స్టార్ కృష్ణ కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌కు సాంకేతిక సొబగులు అద్ది, సాహసమే శ్వాసగా సాగిన కృష్ణ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్‌స్టార్ మరణంతో తెలుగు సినిమా తొలి తరం సూపర్స్టార్ల శకం ముగిసినట్లయ్యింది. తొలుత ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్ఆర్, ఇటీవల కృష్ణంరాజు కన్నుమూయగా... తాజాగా ఆ తరానికి ప్రతినిధిగా మిగిలిన నటశేఖర కృష్ణ కూడా మనకు దూరమయ్యారు.
స్వర్గానికి తరలివెళ్లిన నరకాధిపతి:
తాజాగా నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. నవరసాలను అద్భుతంగా పలికించగల అరుదైన నటుల్లో కైకాల ఒకరు. మహానటులు ఎస్వీ రంగారావు తర్వాత ఏ పాత్రనైనా అవలీలగా పోషించల నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. కైకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయ్యింది. మరీ ముఖ్యంగా 1960, 1970లలో టాలీవుడ్ ఖ్యాతిని దిగంతాలకు చాటి చెప్పిన ముగ్గురు నటులు స్వల్ప వ్యవధిలో మన్నలి విడిచి వెళ్లడం దురదృష్టకరం.
వీరి జీవితాలను పాఠ్యాంశాలుగా చేయాలంటున్న విశ్లేషకులు :
వారు గతించినా వారి గుర్తులు విడిచే వెళ్లారు. వారు నటించిన సినిమాలు, చేసిన ప్రయోగాలు, పాత్రలు, అనుభవాలను రేపటి తరాలకు మార్గదర్శకం చేసేలా అందరికీ అందుబాటులో వుంచాలని పలువురు కోరుతున్నారు. వీరి జీవితాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకే తరహా క్యారెక్టర్లు చేస్తూ అదే చట్రంలో వుండిపోకుండా అన్ని రకాల పాత్రలు పోషించాలని వీరంతా ముందు తరాలకు నేర్పిస్తున్నారు. ఇలాంటి నటులు వుండటం అప్పటి తరం డైరెక్టర్లు, నిర్మాతలు చేసుకున్న అదృష్టం . అందుకే తెలుగు చిత్ర పరిశ్రమకు అదంతా స్వర్ణయుగం. అప్పుడు వచ్చిన చిత్రాలు, అందులోని పాత్రలు, పాటలు ఒకేటిమిటీ వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదంతా రాబోయే తరాలకు తెలియాల్సి వుంది. ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments