షాకింగ్: బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్!
- IndiaGlitz, [Friday,March 27 2020]
కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. చిన్న-పెద్దా, పేద-ధనిక అనే తేడా లేకుండా కరోనా కాటేస్తోంది. తాజాగా.. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటీవ్ వచ్చిందనే షాకింగ్ విషయం వెలుగుచూసింది. గత రెండ్రోజులుగా జలుబు, దగ్గు, తుమ్ములతో బాధపడుతున్న ఆయన కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా పాజిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెళ్లడించడం గమనార్హం. బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకూ బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. మరోవైపు కరోనా వల్ల 578 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాధినేత కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. అయితే ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ప్రజల సంక్షేమాన్ని చూడటానికి ప్రధాని ఎవరినైనా నియమిస్తారా..? లేకుంటే.. ఆయన ఇంట్లో నుంచే అన్నీ మానిటరింగ్ చేస్తారా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.