Yasaswi Kondepudi:అతనో చీటర్.. ఓట్ల కోసం అబద్ధాలు, యశస్వి కొండెపూడిపై ఎన్జీవో సంస్థ ఆరోపణలు
- IndiaGlitz, [Thursday,February 09 2023]
యశస్వి కొండెపూడి.. ఈ పేరు అందరికీ తెలిసిందే. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో ప్రసారమైన ‘‘సరిగమప సింగింగ్ షో’’ టైటిల్ విన్నర్ అయిన యశస్వీకి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. సమంత, శర్వానంద్ నటించిన జానులోని ‘‘లైఫ్ ఆఫ్ రామ్’’ పాటను అద్భుతంగా పాడి రాత్రికి రాత్రి స్టార్‌గా మారాడు. ఇతనికి ఎంతో మంది సంగీత ప్రియులు వీరాభిమానులుగా మారారు. అయితే ఇటీవల యశస్వి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. పబ్లిసిటీ కోసం చీటింగ్‌కు పాల్పడినట్లుగా ‘‘నవసేవ ఫౌండేషన్’ నిర్వాహకురాలు ఫరా కౌసర్ ఆరోపించారు.
50 మందిని చదివిస్తున్నానన్న యశస్వి:
కొద్దిరోజుల క్రితం ఓ షోలో పాల్గొన్న యశస్వి మాట్లాడుతూ.. తాను నవసేవ పేరుతో ఓ ఎన్జీవో సంస్థను నడుపుతున్నానని, దాని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నానని చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఫరా ఖండించారు. యశస్వి చెప్పినదానిలో నిజం లేదని.. ఆ ఎన్జీవోకు అతనికి ఎలాంటి సంబంధం లేదని, దానిని తానే నడుపుతున్నట్లు వెల్లడించింది. సింగింగ్ షోలో జనాన్ని ఆకట్టుకోవడానికి, ఓట్లు సంపాదించుకోవడానికి నవసేను తానే నడిపిస్తున్నట్లు యశస్వి అబద్ధాలు చెప్పాడని ఫరా స్పష్టం చేశారు. దీనిపై తాను అతనిని నిలదీశానని.. క్షమాపణలు చెప్పాలని కోరానని ఆమె పేర్కొంది.
ఆ ఎన్జీవో యశస్విది కాదు:
తాను మాటలను అతను పట్టించుకోలేదని.. సేవ చేస్తున్నట్లు అబద్ధాలాడి పాపులర్ అవ్వాలని ప్రయత్నించాడని ఫరా ఆరోపించింది. దీనిపై త్వరలోనే యశస్వి, టీవీ ఛానెల్, యాంకర్‌పైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఫరా కౌసర్ స్పష్టం చేసింది. మరి దీనిపై యశస్వి ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే అతని అభిమానులు, సంగీత ప్రియులు మాత్రం ఫరా మాటలతో ఉలిక్కిపడ్డారు. అయితే నిజానిజాలు త్వరలోనే తెలియాలని వారు కోరుకుంటున్నారు.