వైసీపీకి మరో భారీ షాక్.. కీలక దళిత నేత రాజీనామా
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం జగన్కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న డొక్కా.. ఇప్పుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం నేతల ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లడం లేదు.
అలాగే కొద్దిరోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడుతూ మాట్లాడారు. పార్టీలో తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్కసారి సీఎం జగన్ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతలను వేడుకున్నారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయనను పార్టీ మరింత దూరంగా పెట్టింది. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా కనీసం పార్టీ కార్యక్రమాలపైనా సమాచారం ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన పార్టీకి రాజీనామా చేశారని సన్నిహితులు చెబుతున్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన తాడికొండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించి మంత్రిగా సేవలు అందించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో తాడికొండ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు సమయంలో ఆయన వైసీపీలో చేరిపోయారు.
కాగా డొక్కా రాజీనామాతో గుంటూరు జిల్లాలో పార్టీకి నష్టమని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించిన ఆయన ఎందుకో చేరలేదు. ఇప్పుడు నామినేషన్లు గడువు ముగిసిన తర్వాతి రోజే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన త్వరలోనే తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments