కంచుకోటలో జగన్‌కు కోలుకోలేని షాక్!
- IndiaGlitz, [Monday,January 28 2019]
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టికెట్లు ఆశించిన నేతలకు అధిష్టానం మొండిచేయి చూపడంతో జంపింగ్‌లు షురూ చేశారు. ఇప్పటికే పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలు వేర్వేరు కండువాలు కప్పుకున్న సంగతి తెలిసిందే. ఎవరైతే అధికార, ప్రతిపక్ష పార్టీలో కీలకంగా ఉంటారో ఆ నేత బంధువులను, కుటుంబీకులకు ఎరవేసి మరీ పార్టీల్లోకి చేర్చుకోవడానికి అధిపతులు పోటాపోటీగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావకు గాలం వేసి వైసీపీలో చేర్చుకున్న విషయం విదితమే. తాజాగా.. వైసీపీ కీలక నేత, పార్టీలో నంబర్-2 అని పిలిపించుకునే ఎంపీ విజయసాయిరెడ్డి బావమరిది గడికోట ద్వారకనాథ్ రెడ్డికి టీడీపీ ఎరవేసింది.
విజయసాయి బావమరిది కడప జిల్లాకు రాయచోటి నియోజకవర్గంలో మంచిపట్టున్న నేత .ఇప్పటికే ఆయన ఒకసారి ఎమ్మెల్యే కూడా పనిచేశారు. అయితే గత రెండు దఫాలుగా ఆయన టికెట్ ఆశించారు. అయితే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీలో చేరికతో తనను పట్టించుకోలేదని అసంతృప్తితోనే పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి, టీడీపీ ముఖ్యనేతలు ఆయనతో రాయబారం నడిపినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాయచోటి వైసీపీ నేతలు, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి మంతనాలు జరపడం మొదలెట్టారని టాక్. కాగా.. ద్వారకతో వైసీపీ నేతలు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది.
సోమవారం ఉదయమే ద్వారకనాథ్ రెడ్డి తన అనుచరులు, ముఖ్యకార్తకలతో అమరావతికి చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈరోజు సాయంత్రం లేదా మంగళవారం ఉదయం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే జరిగితే జగన్ కంచుకోట అయిన కడప జిల్లా రాయచోటిలో పెద్ద ఎదురుదెబ్బేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీకాంత్ రెడ్డి కాకుండా మరో ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సారి కూడా తనకు టికెట్ రాదని భావించిన ద్వారకనాథ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయనకు టీడీపీ నుంచి వచ్చిన హామీ ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది.