Cheruku Sudhakar: హస్తం పార్టీకి చెరుకు సుధాకర్ రాజీనామా.. కాంగ్రెస్‌లో బీసీలకు న్యాయం జరగడం లేదా..?

  • IndiaGlitz, [Saturday,October 21 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే బీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి గుడ్ బై చెప్పి కారు ఎక్కారు. తాజాగా ఆయన బాటలోనే మరో బీసీ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ రాజీనామా చేస్తూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో బీసీలకు విలువ లేదని.. ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నకిరేకల్ అసెంబ్లీ సీటు రాకపోవడంతో...

ఈ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెరుకు సుధాకర్ భావించారు.. అయితే కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో బీసీలకు 12 సీట్లు కేటాయించింది. నకిరేకల్‌లో ఆయనకు బదులు వేముల వీరేశంకు టికెట్ కేటాయించారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన పార్టీకీ రాజీనామా చేశారు. నేడు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సుధాకర్‌తో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలు చర్చలు జరిపారని సమాచారం.

బీసీల పట్ల కోమటిరెడ్డి వెటకారం మాటలు..

ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్‌, దొరల తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ అని రాహుల్ గాంధీ చెబుతున్నారని.. కానీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న భూస్వామ్య పోకడలు మాత్రం పోలేదన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చినప్పటికీ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిలువరించడంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. బీసీలకు 12 సీట్లు ఇచ్చామంటూ కోమటిరెడ్డి వెటకారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు అన్యాయం జరుగుతుందన్న పొన్నాల..

మరోవైపు జనగామ సీటు ఆశించిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీలో తనకు జరిగిన అవమానాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తన లాంటి సీనియర్‌ నేత అధిష్టానంతో పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్‌మెంట్‌ కోసం వేచి చూడడం దురదృష్టకర పరిణామమని వెల్లడించారు. కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వివరించారు.

కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారిన వలసలు..

ఇక మల్కాజ్‌గిరి స్థానంను మరో బీసీ నేత నందికంటి శ్రీధర్ ఆశించారు. అయితే మైనంపల్లి హన్మంత్ రావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో మల్కాజ్‌గిరి టికెట్‌ను ఆయనకు కేటాయించారు. దీంతో మనస్థాపం చెందిన నందికంటి శ్రీధర్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. వీరితో పాటు ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పార్టీని వీడుతారో తెలియని అయోమయం నెలకొంది. ఎన్నికల వేళ టికెట్ రాని అభ్యర్థులు పార్టీలు మారడం సహజమేనని పార్టీలోని ఓ వర్గం నేతలు చెబుతున్నారు.

More News

Nani: 'సరిపోదా శనివారం' అంటున్న నాని..

వరుస సినిమాలతో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్నాడు. ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇటీవల దసరా మూవీలో ఊర మాస్ పాత్రలో నటించిన నాని..

Bigg Boss 7 Telugu: వెళ్లిపోతానంటూ నస.. శివాజీలో పెరిగిపోతోన్న ఫ్రస్ట్రేషన్

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబీపురంగా విడిపోయి గ్రహంతరవాసులను సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Gaganyaan Mission 2023: గగన్‌యాన్ మిషన్ గ్రాండ్ సక్సెస్.. ఫలించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి..

ఇస్రో మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు చేపట్టిన గగన్‌యాన్ మిషన్ సక్సెస్ అయింది.

Election Officials:ఎన్నికల వేళ బ్యాంకు మేనజర్లకు కీలక సూచనలు చేసిన ఎలక్షన్ అధికారులు

తెలంగాణ ఎన్నికల వాతావరణం మొదలైన సంగతి తెలిసిందే. ఓ వైపు నేతల హోరాహోరి ప్రచారం.. మరోవైపు పోలీసుల తనిఖీలతో రాష్ట్రంలో

Governor:స్కిల్ కేసులో సంచలన పరిణామం.. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై విచారణకు గవర్నర్ ఆదేశాలు

స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈసారి ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించడం సంచలనంగా మారింది.