టీడీపీకి ఊహించని షాక్.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ రాజీనామా అంశం పెండింగ్‌లో ఉంది. పలు మార్లు స్పీకర్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అది కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే తరుణంలో రాజీనామా ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎన్నికల వేళ రాజీనామా ఆమోదించడం వెనక కారణాన్ని టీడీపీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. త్వరలోనే ఏపీకి సంబంధించిన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఆయన రాజీనామాను ఆమోదిస్తే ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలు ఉండదు. దీంతో అధికారికంగా టీడీపీకి ఓ ఎమ్మె్ల్యే బలం తగ్గుతుంది. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు అధికార వైసీపీకే దక్కుతాయి.
అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేల అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో టికెట్ రాని ఎమ్మెల్యేలతో పాటు స్థానచలనమైన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిలో కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే ఓ స్థానం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించే క్రమంలోనే గంటా రాజీనామాను ఆమోదించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఎటువంటి నష్టం ఉండదు. కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే రాజీనామా ఆమోదించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపైనా అనర్హతా వేటు వేయాలని టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఇరు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి వీరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com