మంత్రి పరిటాల సునీతకు ఎన్నికల ముందు భారీ షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
పరిటాల ఫ్యామిలీకి పతనం మొదలైందా..? రానున్న ఎన్నికల్లో పరిటాల సునీత పరిస్థితి ఘోరంగా ఉండబోతోందా..? అంతా నా వాళ్లే అనుకున్న అనుచరులు ఎందుకు ఆ ఫ్యామిలీకి దూరమవుతున్నారు..? ఏకంగా పరిటాల సునీత కాన్వాయ్‌పై చెప్పులతో దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ఎన్నికల ముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముంథు ఇంకెలా ఉండబోతోందో అనేది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అనుచరులు ఒక్కొక్కరు చేజారుతున్నారు..!
‘అనంత అంటే పరిటాల ఫ్యామిలీ..’ ‘పరిటాల అంటే అనంత’ అనేలా ఒకప్పుడు పరిస్థితులుండేవి. అయితే రవి మరణాంతరం ఆ పేరును కుటుంబీకులు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో వారికే అర్థం కాని పరిస్థితి. పరిటాల రవి రైట్ హ్యాండ్‌గా పేరుగాంచిన వేపకుంట రాజన్న ఇటీవల టీడీపీకి టాటా చెప్పేశారు. త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో సునీత కుటుంబ సభ్యులు, బంధువులకు తప్ప పేదలకు, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న మేలేమీ లేదని అందుకే ఇక సునీతతో వేగలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత నియోజకవర్గంలో చెప్పులతో దాడి..!
ఏపీ సీఎం చంద్రబాబు ఎలక్షన్ స్టంట్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ‘పసుపు కుంకుమ’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పరిటాల సునీత నియోజకవర్గం అయిన రాప్తాడు తోపుదుర్తిలో నిర్వహిస్తున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లారు. అయితే కార్యక్రమానికి వెళ్లిన సునీతకు ఊహించని చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. మీ వల్ల మాకు ఒరిగిందేంటి.. అంటూ ఆగ్రహించిన స్థానికులు, మహిళలు సునీత వాహనంపైకి చెప్పులు విసిరారు. కాగా వీరిలో దాదాపు అందరూ మహిళలే ఉండటం గమనార్హం.
అసలెందుకిలా జరిగింది..!?
ఎన్నికలకు ముందు తమకు రుణమాఫీ చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ కొందరు డ్వాక్రా చెల్లెమ్మలు కన్నెర్రజేశారు. ఎప్పట్నుంచే మాఫీ అవుతుందని వేచి చూసిన మహిళలు ఎంతక మాఫీ కాకపోగా అస్తమాను వడ్డీ చెల్లిస్తూ నానా తిప్పలు పడుతున్నామని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో సునీత నియోజకవర్గానికి రావడంతో ఆమె వాహనంపైకి చెప్పులు, చీపుర్లు విసిరారు. దీంతో సుమారు గంటపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకొందరు మహిళలు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాలుగేళ్లుగా మా గ్రామానికి చేసిందేమీ లేదని.. ఆమె వల్ల మాకు ఒరిగిందేమీ లేదని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓట్లకోసమే మేం కనపడ్డామా అంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన మహిళలు ‘సునీతమ్మ నిన్ను నమ్మం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరికి తోడు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు రంగంలోకి దిగడంతో మరింత రసవత్తరంగా మారింది.
రెండ్రోజులుగా.. టెన్షన్ టెన్షన్
కాగా తోపుదుర్తి గ్రామంలో గత రెండు రోజులుగా టెన్షన్ టెన్షన్ వాతావరణం ఉంది. మంత్రి సునీత మా గ్రామంలో తిరిగే అర్హత లేదంటూ అప్పటికే పలుమార్లు మహిళలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే సునీత మాత్రం పెద్ద ఎత్తున అనుచరులు, పోలీసు భద్రతతో గ్రామంలోకి వెళ్లడానికి యత్నించారు. ఆమె ప్రయత్నాలేమీ ఫలించకపోగా ఇలా దాడి జరగడం గమనార్హం. ఈ క్రమంలో పలువురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ధర్నాకు దిగారు. ఈ వ్యవహారం చాలా వరకు తెలుగు చానెళ్లలో ప్రసారం కాకపోవడం గమనార్హం. దీన్నే సువర్ణావకాశంగా భావించిన వైసీపీ కార్యకర్తలు ఇదిగో.. మంత్రి మేడమ్ గారి సొంతనియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేయండి అంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించనక్కర్లేదు.. మీరు ఎన్నికల ముందే ఓడిపోయారు మేడమ్.. అంటూ పలువురు వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు కామెంట్ వర్షం కురిపిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలన్నీ బేరీజు చేసుకుంటే పరిటాల ఫ్యామిలీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో.. జనాల్లో వారి గురించి ఎలాంటి టాక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అనుచరులు అంతా దూరమవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు తాజా ఘటనతో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్లేనని పరిటాల ఫ్యాన్స్ భావిస్తున్నారట. అయితే పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోకపోతే రానున్న ఎన్నికల్లో పరాజయం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనం మెచ్చే నేత పరిటాల సునీత ఎదిగి విజయం దక్కించుకుంటారో లేకుంటే వైసీపీ ఖాతాలోకి రాప్తాడును ఇచ్చేస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com