Palla Rajeswar Reddy: జనగామ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. పల్లాకు షాక్ తప్పదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అన్ని పార్టీల్లోని ఉన్న అసంతృప్తులు ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా పొన్నాల పార్టీలోకి వస్తానంటే ఆయన ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో పొన్నాల బీఆర్ఎస్లో చేరడం ఖాయమైనట్లు సమాచారం.
టికెట్ నాదేనని.. ప్రచారం కూడా మొదలుపెట్టిన పల్లా రాజేశ్వర్ రెడ్డి..
ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడే అసలు కథ మొదలైనట్లు పరిస్థితి తయారైంది. ఎందుకంటే జనగామ ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత వివాదం జరిగిందో విధితమే. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ నిరాకరించడంతో ఆయన అలకబూనారు. దీంతో ఆయనను బుజ్జిగించేందుకు ఆర్టీసీ చైర్మన్ పదవి అప్పగించారు. దాంతో కొంత అలక వీడిన ముత్తిరెడ్డి.. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. పల్లా అయితే ముత్తిరెడ్డి కాళ్లకు నమస్కారం కూడా చేశారు. ఇద్దరు నేతలు కలిసిపోవడంతో పార్టీ శ్రేణులు,కార్యకర్తలంతా సంబరాలు చేసుకున్నారు. వివాదం సద్గుమణగడంతో తనకే టికెట్ ఖరారైందని పల్లా నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
పొన్నాలకు టికెట్ ఇచ్చి బీసీ కార్డు వాడుకునేలా ప్రణాళికలు..
అయితే కాంగ్రెస్కు పొన్నాల రాజీనామాతో ఇప్పుడు జనగామ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పొన్నాల పార్టీలో చేరే అవకాశం ఉండటంతో పల్లాకు టికెట్ ఇవ్వరనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన పొన్నాలకు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొన్నాలకు టికెట్ ఇస్తే బీసీ కార్డు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందని చెప్పడం, బీసీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందనే చెప్పేలా ప్రణాళికలు రచిస్తున్నారట. కానీ పొన్నాలను జనగామ అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్న పల్లా, ముత్తిరెడ్డి సహకరిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమైన తరుణంలో పొన్నాలకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్లో మళ్లీ అసంతృప్తి తారాస్థాయికి చేరడం ఖాయమని వారి అనుచరులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com