Kodali Nani: గుడివాడ వైసీపీలో ఫ్లెక్సీల కలకలం.. కొడాలి నానికి చెక్ పెట్టనున్నారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు పట్టుమని రెండు నెలలు కూడా లేకపోవడంతో పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఏడు జాబితాల్లో 65 మంది అసెంబ్లీ అభ్యర్థులను అనౌన్స్ చేశారు. అయితే ఇందులో గుడివాడ సీటు కన్ఫార్మ్ కాలేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు స్వస్థలం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఆయన గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు.
అయితే తర్వాత పరిణామాలతో గుడివాడం అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడగా మారిపోయింది. గత రెండు దశాబ్దాల నుంచి ఆయనే గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి.. 2014, 19 ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి విజయబావుటా ఎగరేశారు. అనంతరం మంత్రిగా కూడా పనిచేశారు. సీఎం జగన్ సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. జగన్ మీద ఈగ కూడా వాలనీయకుండా ప్రతిపక్ష నేతల మీద విరచుకుపడే నేతల్లో ముందు వరుసలో ఉంటారు. కానీ వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి వేరే అభ్యర్థి పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది. పార్టీ గెలుపే లక్ష్యంగా సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తున్న జగన్.. గుడివాడలో కూడా అభ్యర్థిని మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని.. ఆయనను గుడివాడ అభ్యర్థిగా ఎంపిక చేశారంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ ఫ్లెక్సీలు కలకరం రేపడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని తొలగించారు. కొడాలి నాని ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని హనుమంతరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు.
కాగా నియోజకవర్గంలో కొడాలి నానిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. గడప గడపకూ కార్యక్రమాన్ని కూడా ఆయన సీరియస్గా తీసుకోలేదని ఐప్యాక్ సిబ్బంది జగన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు వైసీపీలో చర్చ జరుగుతోంది. కానీ గుడివాడను అడ్డాగా మార్చుకున్న కొడాలి నాని వేరే నేతలను బలంగా ఎదగనీయకుండా చేశారని అసమ్మతి నేతలు చెబుతూ ఉంటారు. అయితే సర్వే రిపోర్టుల ఆధారంగా కాపు సామాజికవర్గానికి చెందిన నేతను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని పేర్కొంటున్నారు. కొడాలిని మరో కీలకమైన నియోజకవర్గానికి మాత్రం పంపొచ్చనే టాక్ మాత్రం జోరుగా నడుస్తోంది. మరి కొడాలి నాని గుడివాడలో పోటీ చేస్తారా..? లేదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments