జేసీకి భారీ షాక్.. రూ.100 కోట్ల జరిమానా విధించిన మైనింగ్ అధికారులు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జేసీకి భారీ జరిమానా విధించారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో జేసీ దివాకర్‌రెడ్డి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ మైనింగ్ అధికారులు రూ.100 కోట్ల జరిమానా విధించారు. జరిమానా కట్టకపోతే ఆర్‌అండ్‌ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపినట్టు ఆరోపిస్తున్నారు. 14 లక్షల మెట్రిక్ టన్నుల మైనింగ్ దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని మైనింగ్ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. త్రిశూల్‌కి సంబంధించిన అనుమతులను తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో పొందారు. అనుమతులు వచ్చిన అనంతరం పనిమనుషుల పేర్ల నుంచి నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారు. కాగా.. అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్ నింబంధనల ఉల్లంఘనపై కూడా అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే జీసీ కుటుంబం నిర్వహిస్తున్న పలు మైనింగ్ సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. జేసీ కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న బ్రమరాంబ, సుమన మైనింగ్ సంస్థల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. అలాగే జేసీ కుటుంబానికి చెందిన రెండు డోలమైట్ మైనింగ్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments