చంద్రబాబుకు 'డబుల్' షాక్.. త్వరలో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ కానున్నారా..? టీడీపీ అధినేత చంద్రబాబుకు డబుల్ షాక్ తగలనుందా..? ఇప్పటికే వరుస షాక్‌లతో సతమతం అవుతున్న ఇదో భారీ షాక్ కానుందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు టీడీపీకి టాటా చెప్పాలనుకుంటున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు..? ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అనంతరం పలువురు టీడీపీ ఎంపీలు, ముఖ్య నేతలు, కీలక నేతలు ఆ పార్టీకి టాటా చెప్పి బీజేపీ, వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీలోకి చంద్రబాబే దగ్గరుండి పంపుతున్నారని.. రానున్న ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయ్.. ఇది ఎంతవరకూ నిజమన్నది తెలియరాలేదు కానీ చేరికలు మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు.
వంశీ వైసీపీలోకి వస్తారా..?
తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇద్దరూ టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. వల్లభనేని వంశీ తనకు తానుగా వెళ్లి బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలవడం.. ఒకే కారులో ఇద్దరూ కలిసి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్లడంతో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఇంటికొచ్చిన వంశీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలవడంతో అసలు ఈయన ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పరిస్థితి.
కరుణం కాషాయ కండువా కప్పుకుంటారా!
ఇదిలా ఉంటే.. సుజనా చౌదరి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తుండగా.. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం భేటీ అయ్యారు. కరణం బలరాం నివాసంలో ఈ భేటీ జరగడం.. ఇద్దరూ కలిసి భోజనం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సుమారు అరగంటకు పైగా చర్చలు జరిగాయట. ఉదయం సుజనాను వంశీ కలవడం.. సాయంత్రం కరణం బలరాం కలవడంతో ఇద్దరూ కలిసి టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. సుజనాతో టీడీపీ ఎమ్మెల్యేల వరుస భేటీలతో తెలుగుదేశం అధిష్ఠానం తలపట్టుకుంటోందట. మరి ఈ ఇద్దరూ ఒకప్పుడు టీడీపీలో ఉంటే అనుబంధంతోనే కలిశారా లేకుంటే పార్టీకి టాటా చెప్పేయడానికి ఫిక్స్ అయ్యారా..? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇదే గానీ జరిగితే చంద్రబాబు డబుల్ షాక్ తప్పదేమో మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments