అక్కడ బావ.. ఇక్కడ బావమరిదికి ఎదురుదెబ్బ!
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. నేడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘోర పరాభవం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో అటు కుప్పంలోనూ.. ఇటు హిందూపూర్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించడం గమనార్హం. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒక పంచాయతీలో గెలుపొందారు. అలాగే... హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధికి షాక్ తగిలింది.
అప్పుడు మాత్రమే కనిపిస్తారట..!
పార్థసారధి సొంత పంచాయతీ రొద్దంలో టీడీపీ ఓటమి పాలైంది. బీకే పార్థసారధి సొంత వార్డు మరువపల్లిలోనూ టీడీపీకి పరాభవం ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ మొత్తమ్మీద కేవలం మూడంటే మూడు స్థానాలను మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. అలాంటి సమయంలో ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత అలర్ట్‌గా ఉండాలి? అలాంటిది రాష్ట్ర పరిస్థితులపై దృష్టి సారిస్తూ చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని మాత్రం పక్కనబెట్టేశారు. ఇక బాలయ్య అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనో లేదంటే లేపాక్షి ఉత్సవాల సమయంలోనో అదీ కాదంటే సినిమా షూటింగ్స్ లేనప్పుడు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తారనే టాక్ ఉంది. నిజానికి హిందూపూర్ టీడీపీకి కంచుకోట. ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది.
మున్ముందు కష్టమే..!
స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించినప్పటి నుంచి హిందూపూర్ ప్రజానీకం టీడీపీని తప్ప మరో పార్టీని ఎంచుకోరు. అందుకే బాలయ్య కూడా పోటీ చేసేందుకు అదే స్థానాన్ని ఎంచుకుంటారు. అలాంటిది పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఇంతటి ఘోర వైఫల్యాన్ని చవిచూడటం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలను తప్ప మరో ఎన్నికలు బాలయ్యకు పట్టవనే ఆపవాదు కూడా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తమ వైఫల్యాన్ని అధికార పక్షం అవినీతి జాబితాలో తోసేస్తూ పోతే టీడీపీ మున్ముందు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు రాష్ట్ర సమస్యలతో పాటు సొంత నియోజకవర్గాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout