గ్రేటర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ మేయర్..
- IndiaGlitz, [Friday,February 09 2024]
లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈమేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.
ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నాను. పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేసేందుకు కొంత మంది కుట్ర చేస్తూంటే పార్టీ అధినాయకత్వం వారిపై చర్యలు తీసుకోలేదు. పైగా వారికే మద్దతు ఇచ్చారు. రాజకీయంగానే కాకుండా భౌతికంగా కూడా నిర్మూలించే కుట్ర చేస్తున్నారని తెలిసి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా పనిచేశా. ఉద్యమకారుడికి రక్షణ కరువైంది. అందుకే పార్టీకి రాజీనామా చేస్తు్న్నాను అని లేఖలో పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ అంటే ఎవరో తెలియని సమయంలో ఆయన పుట్టినరోజును తొలిసారిగా తెంగాణ భవన్‌లో 2007లో అట్టహాసంగా నిర్వహించానని గుర్తుచేశారు. టీఆర్ఎస్‌వీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పదేళ్లు పని చేశానని.. ఉద్యమ సమయంలో ఎన్నో కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన తనకు రెండు సార్లు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని మోసం చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్‌గా కొనసాగిస్తానని చెప్పి కేటీఆర్ మాట తప్పారని వెల్లడించారు.
గత మూడేళ్లుగా జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా తనను అణిచివేయాలని చూశారన్నారు. కనీసం తన డివిజన్‌లో కూడా తనను తిరగనీయడం లేదని వాపోయారు. తనను అనంతమొందించడానికి ఓ రౌడీషీటర్‌కు సుపారీ ఇచ్చారని ఆరోపించారు. పార్టీ పెద్దలకు ఫిర్యాదుచేసినా తనకు అండగా నిలవలేదన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ తొలి డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్ విధులు నిర్వర్తించారు. మరోవైపు గ్రేటర్ పరిధిలో పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది.