BRS Party: బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే..
Send us your feedback to audioarticles@vaarta.com
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు వరుస పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో గులాబీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
విఠల్ రెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ బీజేపీ అభ్యర్థి రామారావు పవార్ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయన గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
మరోవైపు ఇదే జిల్లా కీలక నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన రాకను స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని చాలా మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు చక్కబడి వాతావరణం అనుకూలిస్తే ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని సమాచారం.
ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలోనూ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉందని సమాచారం. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా నామాను కేసీఆర్ మరోసారి బరిలో దింపారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో అక్కడ గెలిచే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో బీజేపీ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా నామాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఖమ్మం ఎంపీ టికెట్‌ను చంద్రబాబు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే నామాతో బీజేపీ, టీడీపీ నేతలు మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీకి టికెట్ ఇచ్చేందుకు మాత్రం కమలం నేతలు వ్యతిరేకిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇక్కడి నుంచి పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఏది ఏమైనా కానీ టీడీపీ లేదా బీజేపీ నుంచి నామా పోటీ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. కాగా 2009లో టీడీపీ ఎంపీగా నామా విజయం సాధించగా.. 2014లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాలతో గులాబీ కండువా కప్పుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments