Chandrababu:చంద్రబాబుకు షాక్.. పెనమలూరు రెబల్ అభ్యర్థిగా బోడే ప్రసాద్..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే పెనమలూరు టికెట్ అంశంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బోడె ప్రసాద్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. దీంతో అక్కడ క్యాడర్ భగ్గుమంటోంది.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఓడిపోయినా సరే పార్టీని అంటిపెట్టుకుని తమ నేత బోడె ప్రసాద్‌కు ఎందుకు టికెట్ ఇవ్వరంటూ మండిపడుతున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలోనూ బోడె వైపే ప్రజలు మొగ్గుచూపారని చెబుతున్నారు. అయినా కానీ ఎందుకు టికెట్ ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. దీంతో బోడె ప్రసాద్ రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెబల్ అభ్యర్ధిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికీ తిరుగుతున్నారు. తనకు చంద్రబాబు అన్యాయం చేశారని ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పెనమలూరు సీటుపై చంద్రబాబు తొలి నుంచి అయోమయంగా ఉన్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమ పోటీకి రెడీ అయ్యారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను పార్టీలో చేర్చుకుని ఆయనున టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉమకు పెనమలూరు టికెట్ ఇస్తామని చెప్పారు. అప్పటి నుంచి బోడె ప్రసాద్ రాజకీయ జీవితం అయోమయంలో పడింది. దేవినేని ఉమకు టికెట్ ఖాయమనుకున్న తరుణంలో కొత్తగా కొంతమంది పేర్లు తెరపైకి రావడం గమనార్హం. అలాగే ముస్లిం అభ్యర్థికి ఇవ్వాలనుకుని మళ్లీ వెనక్కి తగ్గారు.
తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనతోపాటు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చందు పేరునూ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా దేవినేని ఆపర్ణ పేరు కూడా ప్రచారంలో ఉంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ రేసులో ఉన్నారు. ఇంతమంది పోటీ పడటంతో టికెట్ ఎవరికి కేటాయిస్తారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. ఎవరూ పోటీ చేసినా సరే తాను మాత్రం రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతానని బోడె ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి పార్టీ కష్టకాలంలో నమ్మిన బంటుగా ఉన్న బోడె ప్రసాద్ లాంటి నాయకులను చంద్రబాబు వాడుకుని వదిలేశారని తెలుగు తమ్ముళ్లే విమర్శించడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments