Bigg Boss Telugu 7 : యావర్‌కు ఛాన్స్ మిస్, శోభను వరించిన అదృష్టం .. సీరియల్ బ్యాచ్ మధ్య మళ్లీ గొడవలు

  • IndiaGlitz, [Wednesday,December 06 2023]

బిగ్‌బాస్ సీజన్ 7లో చివరి నామినేషన్స్ సోమవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి తప్పించి మిగిలిన శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, అమర్‌దీప్, ప్రియాంకలు నామినేషన్స్‌లో వున్నారు. ఈ వారం ఎలిమినేట్ అయినవారిని తప్పించి మిగిలిన వారు గ్రాండ్ ఫినాలేకు వెళతారు. అయితే నామినేషన్స్ సందర్భంగా పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లకు తారా స్థాయిలో గొడవ జరిగింది. ముఖ్యంగా అమర్‌ను ఉద్దేశించి ‘‘ఆడోడు’’ అంటూ ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నేను ఆడోడినా .. గాజులు ఇస్తే వేసుకుంటానంటూ అమర్ కూడా ఘాటుగా బదులిచ్చారు.

నామినేషన్స్‌తో హీటెక్కిన ఇంటిని కూల్ చేసే పని తీసుకున్నాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా అమర్‌దీప్‌ను యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచి.. పార్టీలో ఏమేం ఉండొచ్చని భావిస్తున్నారు అని అడిగారు బిగ్‌బాస్. చిప్స్, కూల్‌డ్రింక్స్ ఇలాంటివి ఏమైనా వుండొచ్చని అమర్‌ చెప్పగా.. మీ పార్టీల్లో ఇవే వుంటాయా అని సెటైర్ వేశారు బిగ్‌బాస్. ఆ తర్వాత పక్కనే వున్న క్లాత్ తీసి చూడమని చెప్పగా.. అక్క కేక్ వుంది. ఆ కేక్ మొత్తం మీరొక్కరే తినాలని చెప్పడంతో అమర్ షాక్ అయ్యాడు. పావుగంటలో ఆ కేక్ మొత్తం తింటే.. మిగిలిన ఇంటి సభ్యులకు కూడా కేక్ తినే ఛాన్స్ లభిస్తుందని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు. దీంతో అమర్‌ ఎంతో కష్టపడి కేక్ తినడం మొదలుపెట్టినా తన వల్ల కాక వదిలిపెట్టేశాడు. అయితే అమర్‌ లోపల ఏం చేశాడన్నది హౌస్‌మేట్స్‌కు చూపించాడు బిగ్‌బాస్. అది చూసి అంతా నవ్వుకున్నారు.

తర్వాత చిల్ పార్టీ పేరుతో టాస్క్‌ల్లోకి దిగాడు బిగ్‌బాస్. దీనిలో గెలిచిన వాళ్లకు ప్రేక్షకులను ఓటు అడిగే ఛాన్స్ వుంటుందని చెప్పాడు. దీని ప్రకారం ఓ పాట ప్లే కాగానే.. బెంచ్‌పై పెట్టిన వస్తువుల్లో ఒకదానిని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి వుంటుందని ఆదేశించాడు. ఆలస్యంగా దూకే వారు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారని చెప్పాడు. తొలుత అమర్‌దీప్ ఆ తర్వాత శోభా, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీలు వరుసగా ఔట్ కాగా.. ప్రిన్స్ యావర్ విజయం సాధించాడు.

పూల్ టాస్క్ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు కలర్స్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కులో భాగంగా గార్డెన్ ఏరియాలో మూడు కలర్స్ ఏర్పాటు చేసుంటాయి. బిగ్‌బాస్ సమయానుసారం ఏ కలర్ చెబుతారో, కంటెస్టెంట్స్ అంతా ఆ కలర్ లైన్‌లో వెళ్లి నిలబడాలి. ఈ గేమ్‌లో అమర్ రెండు పడవలపై కాలు పెట్టినట్లుగా.. ఒక కలర్‌లో ఒక కాలు, మరో కలర్‌లో ఇంకో కాలు పెట్టాడు. అది ఫౌల్ గేమ్ అని సంచాలకుడిగా వున్న యావర్ చెప్పడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ కలర్స్ టాస్క్‌లో శోభా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి విజయం సాధించింది.

అయితే పూల్ టాస్క్‌లో యావర్, కలర్స్ టాస్క్‌లో శోభా గెలవడంతో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఓటు కోసం అప్పీల్ చేసుకోగలరని .. దానిని ఇంటి సభ్యులే నిర్ణయించాలని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శోభకు ఆమె ఫ్రెండ్స్ అమర్,ప్రియాంకలతో పాటు అర్జున్ ఓటు వేశారు. యావర్‌కు ప్రశాంత్, శివాజీలు ఓటు వేశారు. ఎక్కువ ఓట్లు వచ్చిన శోభాకు ఓటు కోసం అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. తను కార్తీకదీపంలో మోనితలా చూశారని, కానీ నేనెవరో బిగ్‌బాస్ ద్వారానే తెలిసిందని.. తన కుటుంబం మూడు పూటలా భోజనం చేస్తుందంటే మీ వల్లేనని, ఇప్పటి వరకు బిగ్‌బాస్‌ తెలుగులో అమ్మాయి గెలవలేదని .. నేను గెలవాలని అనుకుంటున్నానని చెప్పింది. తనకు ఈ ప్రైజ్‌మనీ చాలా ముఖ్యమని .. తానేమైనా తప్పు చేసుంటే క్షమించాలని తనకు ఓటు వేయాలని అభ్యర్ధించింది. అయితే ఎపిసోడ్ మధ్యలో సీరియల్ బ్యాచ్ మధ్యలో గొడవ జరిగింది. అమర్, ప్రియాంక, శోభలు టెడ్డీ బేర్‌తో ఆడుకుంటూ వుండగా.. ప్రియాంక్ అమర్‌ను గట్టిగా కొట్టడంతో ఆయన హర్ట్ అయ్యాడు. ఆ బొమ్మను విసిరేసి పక్కకెళ్లి కూర్చొన్నాడు.

More News

Hero Flood: వరద నీటిలో ఇరుక్కుపోయిన హీరో.. సాయం కోసం ఎదురుచూపులు..

మిజాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలమైంది. ముఖ్యంగా చెన్నై నగరం చిగురుటాకులా వణికపోయింది.

Revanth Reddy:బ్రేకింగ్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు.

సీఎం జగన్ ముందుచూపుతో యద్ధప్రాతిపదికన సహాయచర్యలు

తీర ప్రాంతమైన రాష్ట్రం కావడంతో ఏపీలో తుఫాన్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభిస్తాయో తెలియదు.

Revanth Reddy:తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు..!

తెలంగాణ కొత్త సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో

Kharge:తెలంగాణ కొత్త సీఎం ఎవరో ఇవాళే నిర్ణయిస్తాం:ఖర్గే

తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సోమవారం సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకున్నారు.