ఎంతో గర్వంగా ఉంది.. సీసీసీకి 2 లక్షలిస్తున్నాం: శివాని, శివాత్మిక
- IndiaGlitz, [Saturday,April 04 2020]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌పై పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలకు అండగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ మొదలుకుని పలు సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన నటీనటులు తమవంతుగా విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు.. సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సైతం ప్రముఖులు అండగా నిలుస్తున్నారు.
మా పేరెంట్స్ స్పూర్తితో..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరోనాపై పోరుకు తమవంతుగా యాంగ్రీస్టార్ రాజశేఖర్, జీవితా రాజశేఖర్ విరాళాలు ప్రకటించారు. అయితే తాజాగా.. జీవిత కుమార్తెలిద్దరూ పెద్దమనసుతో విరాళాలిచ్చారు. సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి శివాని, శివాత్మిక రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వారు తెలియజేశారు. తాము చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులను చూసే పెరుగుతున్నామని.. జీవితంలోని అనేక కోణాల్లో వారు స్పూర్తినింపారని చెప్పుకొచ్చారు. ఎల్లప్పుడూ దయ, బాధ్యతాయుతంగా ఉండాలనేది వారి నుంచి నేర్చుకున్నామన్నారు.
ఎంతో గర్వంగా ఉంది..
‘అమ్మా, నాన్నల నుంచి పొందిన స్ఫూర్తితో మేము మా సంపాదన నుంచి చెరో రూ. లక్ష రూపాయలను కరోనా క్రైసిస్ చారిటీకి ఇస్తున్నాం. ఇలాంటి సంక్షోభ సమయంలో మా సినీ ఇండస్ట్రీ అంతా కలిసి రావడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. పేద కార్మికులను ఆదుకోవడానికి ఇండస్ట్రీ మొత్తం ఇలా ముందుకు రావడం నిజంగా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు’ అని జీవిత కుమార్తెలు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.