'శివమ్' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సార్ సర్టిఫికేషన్ : యు / ఎ
నిడివి: 2.48 గం.
అక్టోబర్ 2న విడుదలైంది శివమ్. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటించిన కంచె విడుదల కావాల్సింది. దీనికి ఒక రోజు ముందు అంటే గురువారం పులి తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అవి రెండూ విడుదల కాలేదు. సో రామ్ నటించిన శివమ్ సోలో రిలీజ్ అయింది. ఈ సోలో రిలీజ్ ని రామ్ సక్రమంగా వినియోగించుకున్నారా? లేదా? ఇంతకీ శివమ్ కథ ఎలా ఉంది? అనే విషయాలు చూద్దాం
శివ (రామ్) కి ఎప్పుడూ ఒకటే ధ్యాస. మనసులు ఇచ్చి పుచ్చుకున్నవారిని కలపాలని. అతను కలిపిన ప్రేమ జంటలు సినిమా పూర్తయ్యే సరికి దాదాపు 116కి చేరినట్టుంటాయి. దేవదాసు, మజ్నులాంటి వారు తాను పుట్టకముందే పుట్టారు కాబట్టి ప్రేమలో ఓడిపోయారని, లేకుంటే తప్పకుండా విజయాన్ని సాధించేవారని, తాను వాళ్ళ ప్రేమను కలిపేవాడినని అనుకుంటుంటాడు. అలాంటి వ్యక్తి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి పేరు తనూజ (రాశీఖన్నా). ఒంటి నిండా ఈగో ఉంటుంది. తనూజను చూడక ముందే శివ మరో సమస్యలో ఇరుక్కుంటాడు. అదే అమిత్‌తో గొడవ. తాను వెలిగించుకోబోయిన లైటర్‌ను తీసుకున్నాడని అమిత్ ను చితకబాదుతాడు. అమిత్ కర్నూలులో చాలా పేరు మోసిన రౌడీ భోజిరెడ్డి కొడుకు. తన కొడుకును కొట్టాడని తెలిసి భోజిరెడ్డి ఊగిపోతాడు. శివను తీసుకుని రమ్మని తన పెద్ద కొడుకును పంపుతాడు. అతను కూడా దెబ్బలు తిని వస్తాడు. ఇంతకీ శివ ఎక్కడున్నాడో తెలియని భోజిరెడ్డి అతని కోసం మనుషులను పెట్టి వెతికిస్తుంటాడు. అలా శివ కోసం ఓ వైపు భోజిరెడ్డి, మరో వైపు అభిమన్యుసింగ్, మరోవైపు శివ మావయ్య టైగర్, శివ తండ్రి పోసాని వెతుకుతుంటారు. సెకండాఫ్ లో శివను వెతికే బ్యాచ్‌లోకి జయప్రకాష్‌రెడ్డి కూడా వచ్చి చేరుతాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు శివ కోసం ఇంత మంది ఎందుకు వెతుకుతున్నారు? 100కి పైగా సిమ్ కార్డులను మెయింటెయిన్ చేయాల్సిన అవసరం శివకేంటి? శ్రీనివాసరెడ్డి ఎవరు? శివ జర్నీలోకి సప్తగిరి ఎందుకు వచ్చాడు? వంటివన్నీ సెకండాఫ్ చూస్తే తెలుస్తుంది.
ప్లస్ పాయింట్లు
రామ్ మూడు గెటప్పుల్లో కనిపించాడు. మూడు గెటప్పులూ అతనికి సూట్ అయ్యాయి. రాశీఖన్నా బొద్దుగా, ముద్దుగా తనకు ఇచ్చిన పాత్రను బబ్లీగా చేసింది. లొకేషన్లు బావున్నాయి. హైదరాబాద్‌లో మనం నిత్యం తిరిగే ప్రదేశాలను కూడా రసూల్ ఎల్లోర్ చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. రామ్ కాస్ట్యూమ్స్ బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బావున్నాయి. భాస్కరభట్ల లిరిక్స్ కొన్నిచోట్ల పెద్దగా మింగుడుపడవు. దేవిశ్రీ బ్యాక్‌గ్రౌండ్ కూడా బావుంది. కథ తొలి సగం ఫర్వాలేదనిపిస్తుంది
మైనస్ పాయింట్లు
సినిమాకు చాలా మైనస్ పాయింట్లున్నాయి. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం, సీనియర్ నరేష్, పోసాని పాత్రలు అసలు అవసరమే లేదు. డాబాలో డ్రగ్స్ బ్యాచ్ ను కొట్టే సీను వృధా అనిపిస్తుంది. ప్రేమికులను కలపడమనే కాన్సెప్ట్ రామ్కీ కొత్త కాదు. రెడీ నుంచి చాలా సినిమాల్లో చేశాడు. ఇందులో సెకండాఫ్‌లో చాలా ల్యాగ్లున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ల మీద ఫ్లాష్ బ్యాక్ లు సినిమా చూసే ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తాయి. మనో ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించారు. కానీ ఆ పాత్రకు అసలు ప్రాధాన్యతే ఉండదు. ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రలను ఒప్పుకోకపోవడమే అతనికి మంచిది. పేదవారు, ఊర్లో ప్రజలు తన ఇంటి ముందు చెప్పులు వేసుకుని తిరగకూడదనుకునే భోజిరెడ్డిని పోలిన పాత్రలు మన సినిమాల్లో చాలానే వచ్చేశాయి.
విశ్లేషణ
భోజిరెడ్డి పాత్ర ఉన్నంతలో బాగానే ఉంది. అమిత్ ఒక్క ఫైటుకు తప్ప మరలా కనిపించడు. భోజిరెడ్డి పెద్ద కొడుకు పాత్ర ఉన్నట్టుండి ప్రాధన్యమున్న పాత్రగానూ, ఉన్నట్టుండి సైడ్ కేరక్టర్గానూ మారిపోతుంటుంది. ఫిష్ వెంకట్ కి ఈ సినిమాఓ మంచి పాత్రే వచ్చింది. ఇటీవల సందీప్ కిషన్ నటించిన ఓ సినిమాలోనూ సప్తగిరి తన కారును పోగొట్టుకున్న వ్యక్తిలాగానే కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లీశ్వరిలో సునీల్ చేసిన పాత్రలో కనిపిస్తాడు. శివ అసలు పేరు శివ కాదనే విషయం సెకండాఫ్‌లో తెలుస్తుంది. శివ అసలు పేరు రామ్ అని రివీల్ అవుతుంది. శివలోని శివను, తన పేరులోని మ్ ను కలుపుకుని శివమ్ అని పెట్టుకుంటాడు హీరో. అసలు శివ ఎవరు? చేతికి చైనులు కట్టుకుని తిరిగిన బ్యాచ్ ఎవరు? వారి కథాకమామీషు మరో ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది. లవ్ గొప్పదా? లక్ గొప్పదా? అనే విషయం క్లైమాక్స్ లో చిరాకు తెప్పిస్తుంది. వంటింట్లో అన్ని మసాలా దినుసులూ ఉంటాయి. అలాగని బిర్యానీ ఆకులను సాంబారులో వాడం. ఫస్టాఫ్‌లో ఫర్వాలేదనిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో ఈ విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. ఏ కమర్షియల్ అంశాన్నీ వదలకూడదనుకుని ఉన్న ఆసర్టిస్టులు అందరినీ తెరపై చూపించే ప్రయత్నం చేశారు. దాంతో సెకండాఫ్ మొత్తం కంగాళీగా మారింది.
బాటమ్ లైన్: కంగాళీగా మారిన కలగూరగంప శివమ్
రేటింగ్: 2/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com