'శివలింగాపురం' ఆడియో, ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ, మలయాళ భాషలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్.కె.సురేష్ ఇప్పుడు శివలింగాపురం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మధుబాల కథానాయికగా నటించింది. తోట కృష్ణ దర్శకుడు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆడియోను ఆవిష్కరించగా...ట్రైలర్ ను హీరో ఆర్.కె.సురేష్ విడుదలచేశారు. నిర్మాత రావూరి వెంకటస్వామి ఏవీని మరో అతిథి సాయివెంకట్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సినిమాలు తీయడమే కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన వ్యక్తిగా రావూరి వెంకటస్వామికి మంచి పేరుంది. అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ఈ చిత్రం హీరో ఆర్.కె.సురేష్ ను చూస్తుంటే జూనియర్ రజనీకాంత్ మాదిరిగా...ప్రతినాయకుడిగా నటించిన డి.ఎస్.రావును చూస్తుంటే జూనియర్ అమ్రిష్ పురిలా అనిపిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలు, చిన్న సినిమాలు విరివిగా రూపొందినపుడే పరిశ్రమను నమ్ముకున్న వారందరికీ పని దొరుకుతుంది. త్వరలో జరగబోయే నిర్మాతల మండలి ఎన్నికలలో మంచి మండలిని ఎన్నుకుంటే చిన్న చిత్రాలకు కూడా న్యాయం జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు. మరో అతిథి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, పలు విద్యాసంస్థల అధినేతగా పేరున్న రావూరి వెంకటస్వామి ఎంతో అభిరుచితో సినిమాలను తీస్తున్నారు. ఆయన తీసిన ఈ చిత్రం ఒకప్పుడు వచ్చిన భక్త సిరియాళ చిత్రం కోవలో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా అని అన్నారు.
చిత్ర నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ, గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో వంటి సినిమాలు తీశాను. ఇది ఆరవ చిత్రం. ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం. మేము పెరిగిన లొకేషన్ లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. కృషి, పట్టుదలతోనే ఈ రోజు ఉన్నతి స్థితికి చేరుకోవడం జరిగింది. తోట కృష్ణ దర్శకత్వంలోనే ఇంకో చిత్రం చేయాలని అనుకుంటున్నాను. దర్శక, నిర్మాతల బంధం సినిమా మొదలయ్యేటప్పుడు ఉన్నట్లు...పూర్తయిన తర్వాత ఉండటం లేదు. కానీ తోట కృష్ణ తాను చెప్పిన బడ్జెట్ లోనే సినిమాను పూర్తిచేసే నిర్మాతల దర్శకుడిగా మొదట్నుంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అని అన్నారు.
చిత్ర దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. ఇందులో అన్నా, చెల్లెల సెంటిమెంట్ హైలైట్ అవుతుంది. ఇదే బేనర్ లో కొత్త చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు.
ప్రతినాయకుడి పాత్రధారి డి.ఎస్.రావు మాట్లాడుతూ, నటుడు కావాలనే చిత్ర పరిశ్రమలోనికి వచ్చాను. అయితే నిర్మాతగా మారి పలు చిత్రాలు చేశాను. ఇప్పుడు నటుడిగా కూడా సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రంలోని నెగటివ్ పాత్ర నాకెంతో పేరు తెచ్చిపెడుతుంది అని అన్నారు.
చిత్ర హీరో ఆర్.కె. సురేష్ మాట్లాడుతూ, ఇప్పటివరకు తమిళ, మలయాళం వివిధ భాషలలో పలు చిత్రాలలో నటించాను. తెలుగులో నాకిది మొదటి చిత్రం. సినిమారంగంతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది అని అన్నారు. తనకు అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ మధుబాల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్ననిర్మాతలు తుమ్మపల్లి రామసత్యనారాయణ, మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి తదితరులంతా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout