Shivaji:ఓట్లు అమ్ముకోవద్దు.. రాజకీయాలపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటుడు శివాజీ మరోసారి ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. అనంతపురంలో జరిగిన ఎన్టీఆర్ వర్థంతి వేడుకల కార్యక్రమంలో శివాజీ, సీనియర్ నటుడు నాగినీడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైపోయిందన్నారు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని తెలిపారు. దివంగత సీఎం ఎన్టీఆర్.. ఆయన కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి దోపిడీకి తెరలేపలేదని.. సహజ వనరులను దోచుకోమని చెప్పలేదని గుర్తుచేశారు.
అలాంటి నిజాయితీ గల నాయకులు ఇప్పుడు లేరన్నారు. ప్రజలు నిజాయితీపరులైన నేతలను ఎన్నుకోవాల.. డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని సూచించారు. డబ్బుల కోసం కాకుండా, మీ బిడ్డల భవిష్యత్ కోసం ఓట్లు వేయాలని కోరారు. దొంగ ఓట్లపై ప్రజలు నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు. ఇక నాగినీడు మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం బాగు కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని కోరారు.
కాగా హీరోగా, నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకున్న శివాజీ.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తర్వాత రాజకీయాలపై మక్కువతో బీజేపీలో చేరారు. అనంతరం అక్కడ ఇమడిలేక బయటకు వచ్చి ఏపీ రాజకీయాలపై గట్టి పోరాటం చేశారు. 2019 ఎన్నికలకు "గరుడ వ్యూహం" అంటూ సంచలనం రేపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రాణహాని ఉందని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అనంతరం అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా నిలిచారు. సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయాలపై స్పందిస్తూ ఉంటారు.
ఇటీవల బిగ్‌బాస్ సీజన్-7లో పాల్గొని అభిమానులను అలరించారు. శివన్నగా అందరి మన్ననలు పొందారు. పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలవడంలో తన వంతు కృషి చేశారు. ఇటీవల ‘90’s– ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’అనే వెబ్ సిరీస్‌లో ఆయన నటించారు. ఈటీవీ విన్ యాప్‌లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 1990లలో తల్లిదండ్రులు, పిల్లలు ఎలా ఉండేవారు అనే ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, తండ్రిగా శివాజీ నటన అద్భుతంగా ఉంది. ఈ సిరీస్ చూసిన వారందరూ శివాజీ తిరిగి సినిమాల్లో నటించాలని కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments