నాగబాబుకు రిటర్న్‌గిఫ్ట్ ఇచ్చేసిన శివాజీ రాజా!

  • IndiaGlitz, [Sunday,April 07 2019]

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో తనకు ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సీనియర్ నటుడు శివాజీ రాజా చెప్పుకొచ్చిన విషయం విదితమే. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటబ్బా అని అటు రాజకీయాల్లో... ఇటు సినీ ఇండస్ట్రీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు ఆదివారం నాడు మా మాజీ అధ్యక్షుడు శివాజీ మీడియా ముందుకు వచ్చేశారు. ఈ సందర్భంగా నాగబాబు తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవీ, పవన్ కల్యాణ్‌‌ను వెనకేసుకువచ్చారు.

నాగబాబుకు ఓటేయద్దు..

నేను గత 32 ఏళ్లుగా మెగా ఫ్యామిలీతో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఉన్నాను. బయటి హీరోల దగ్గర ఎన్నో సినిమాలు చేసినా కూడా ఆ ఫ్యామిలీతో ఎవరితో ఇంత వరకు ఒక్క సినిమా చేయలేదు. నేనెప్పుడు అడగలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. గత ఐదేళ్లలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లో ఎంత పాజిటివ్ నెస్‌ను చూసానో.. నాగబాబులో అంత నెగిటివ్ నెస్‌ను చూశాను. నాగబాబును మాత్రం ప్రజలు ఎన్నుకోవద్దు. ఇలా చెప్పే హక్కు నర్సాపురం ప్రాంత వాసిగా నాకే ఎక్కువ హక్కు ఉంది అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

ఎందుకు ఓటేయద్దంటే...

‘మా’ అధ్యక్షుడిగా ఉన్నపుడు నాగబాబు..‘మా’ ఖజానాను ఖాళీ చేసాడు. అంతేకాదు ‘మా’ ను రెండు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ‘మా’ అసోసియేషన్ వంటి చిన్న సంస్థనే సరిగా నడపలేనివాడు. నరసాపురం ఎంపీగా ప్రజలకు ఏమి చేయలేడు. ఒకవైపు మెగాఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉన్న మాకు వెన్నుపోటు పొడిచి.. మెగా ఫ్యామిలీకి అంతగా పడని వాళ్లకు ఈ ఎన్నికల్లో నాగబాబు సపోర్ట్ చేసాడు అని శివాజీరాజా ఒకింత ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పారు. ఇదిలా ఉంటే.. భీమవరంలో నాగబాబు కులం ప్రస్తావన తీసుకురావడంపై శివాజీ రాజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

శివాజీ రాజా వ్యాఖ్యలతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు శివాజీ నాగబాబు గురించి చెప్పడంతో అది ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే తనను ఓడించినందుకు.. నాగబాబుకు కూడా ఆ ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారన్న మాట. సో ఇదీ నాగబాబుకు శివాజీ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్. అయితే ఈ వ్యవహారంపై నాగబాబు, పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.