Bigg Boss 7 Telugu: వెళ్లిపోతానంటూ నస.. శివాజీలో పెరిగిపోతోన్న ఫ్రస్ట్రేషన్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులు గులాబీపురం, జిలేబీపురంగా విడిపోయి గ్రహంతరవాసులను సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ చివరి టాస్క్ ఇచ్చేశాడు బిగ్‌బాస్. దీని ప్రకారం.. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిని అనర్హుడిగా ప్రకటించే అధికారం గులాబీపురం వాళ్లకు ఇచ్చాడు బిగ్‌బాస్. బజర్ మోగినప్పుడు గులాబీపురం సభ్యులలో ఎవరో ఒకరు గొలుసు దక్కించుకోవాలి. అనంతరం దానిని తమకు నచ్చని కంటెండర్స్ ఫోటోకు గొలుసు కట్టి స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగిపోకుండా వుంటుందో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు.
దీంతో శోభాశెట్టి.. అశ్వినిని, అమర్‌దీప్.. శివాజీని, పూజామూర్తి.. ప్రశాంత్‌ని, ప్రిన్స్ యావర్.. ప్రియాంకాని ఎలిమినేట్ చేశారు. చివరికి సందీప్, అర్జున్‌లు మిగలడంతో వారిద్దరూ కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఈ సందర్భంగా యావర్, ప్రియాంక మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘మాన్షన్ 24’’ టీమ్ బిగ్‌బాస్ ఇంటిలో సందడి చేసింది. ఓంకార్, అవికా గోర్, వరలక్ష్మీ శరత్ కుమార్, నందులు కంటెస్టెంట్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ వెబ్ సిరీస్‌లో ప్రస్తుతం హౌస్‌లో వున్న అమర్‌దీప్ చౌదరి కూడా నటించారు. కాసేపటి తర్వాత మాన్షన్ టీమ్.. ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పారు.
మరోవైపు.. శివాజీ ఆరోగ్యం నానాటికీ దిగజారుతోంది. వయసు, ఆరోగ్యం రీత్యా తాను ఇక ఇంటిలో వుండలేనంటూ మొరపెట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్నోసార్లు నేను బయటికి వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొన్నా మధ్య నయని పావని ఎలిమినేషన్ సమయంలో బయటకు వెళ్లడంతో శివాజీ కథ క్లోజ్ అనుకున్నారంతా. కానీ బయటికి వెళ్లి టెస్టులు చేయించుకుని వచ్చాడు. అయినప్పటికీ శివాజీని మాత్రం ఎలాగోలా ఇంట్లో వుంచాలని బిగ్‌బాస్ డిసైడ్ అయ్యాడు. కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా వ్యవహరించిన శివాజీకి కూడా కెప్టెన్‌గా పోటీ పడే అవకాశం వుందని.. అయితే గెలిచిన జట్టులో ఒకరు త్యాగం చేయాలని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో భోలే షావళి ముందుకొచ్చాడు.
అయితే అమర్‌దీప్.. శివాజీ అనర్హుడంటూ ఎలిమినేట్ చేసేశాడు. దీంతో ఊగిపోయిన శివాజీ.. నేను వేస్ట్ క్యాండిడేట్‌లా కనిపిస్తున్నానా అంటూ ఫైర్ అయ్యాడు. నేను ఈ ఇంట్లో వుండటానికి పనికిరాను, నాకు ఈ హౌస్ వద్దు, నువ్వు వద్దు, తలుపు తీస్తే బయటికెళ్లిపోతా నంటూ గోల గోల చేశాడు. శనివారం హోస్ట్ నాగార్జున వస్తుండటంతో శివాజీ ఎపిసోడ్‌కు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments