వరవరరావును తక్షణమే నానావతి ఆసుపత్రికి తరలించండి: హైకోర్టు
- IndiaGlitz, [Thursday,November 19 2020]
విరసం నేత, హక్కుల కార్యకర్త వరవరరావును తక్షణమే జైలు నుంచి నానావతి ఆసుపత్రికి తరలించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఆయనను ఆసుపత్రికి తరలించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దాదాపుగా మరణానికి చేరువలో ఉన్నారని.. నరాల సంబంధిత ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలూ ఉన్నాయని కోర్టు పేర్కొంది. వరవరరావు మెడికల్ రిపోర్టులు, ఆయన తరుఫు వాదనలు విన్న అనంతరం బెంచ్ ఆయనను నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ ఏడాది జులైలో వరవరరావుకు కరోనా సోకిందని.. అనంతరం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
81 ఏళ్ల వరవరరావుకు అత్యవసర చికిత్సతో పాటు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ కూడా అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆయన ఆసుపత్రికి అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరించాలని.. అలాగే ఆయనను కలిసేందుకు ఆయన భార్యను అనుమతించడంతో పాటు ఆసుపత్రిలో ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జామ్‌దార్‌ల బెంచ్ ఆదేశించింది. తమకు చెప్పకుండా వరవరరావును డిశ్చార్జ్ చేయవద్దని సూచించింది. దీనిపై ప్రభుత్వ తరుఫు లాయర్ దీపక్ ఠాక్రే ఇప్పటికే హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నుంచి సూచనలు తీసుకున్నామని.. ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని కోర్టుకు వెల్లడించారు.
కాగా.. వరవరరావును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళితే సరిపోతుందని అక్కడ అన్ని సౌకర్యాలూ ఉన్నాయని ఎన్ఐఏ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ కోర్టుకు వెల్లడించారు. ఆ కేసును ముంబై హైకోర్టు డిసెంబర్ 3కి వాయిదా వేసింది. అయితే వరవరరావును 2018 జూన్ 18న చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 2017 డిసెంబరు 31 రాత్రి పుణెలో ఎల్గార్ పరిషత్ సదస్సులో పాల్గొన్నందుకు ఆయనను, మరికొందరు హక్కుల నేతలను అరెస్ట్ చేశారు.