close
Choose your channels

షేర్ మూవీ రివ్యూ

Friday, October 30, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏ స్టార్‌కైనా ఒక సినిమా హిట్ అయిందంటే త‌దుప‌రి సినిమాల‌పై ఆటోమేటిగ్గా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉంటాయి. క‌ల్యాణ్ రామ్ విష‌యంలోనూ జ‌రిగింది అదే. ఆయ‌న‌కు ఈ ఏడాది ప‌టాస్ రూపంలో ఓ హిట్ వ‌చ్చింది. ఆ సినిమా త‌ర్వాత విడుద‌లైన షేర్ మీద ఎక్స్ పెక్టేష‌న్స్ పెరిగాయి. ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకోకండీ... మ‌ల్లికార్జున్ టాలెంటెడ్ డైర‌క్ట‌ర్‌. త‌న‌కి ఈ సినిమా రూపంలో ఓ హిట్ వ‌స్తే బావుంటుంద‌ని అనుకుంటున్నా అని క‌ల్యాణ్ రామ్ స్వ‌యంగా చెప్పుకొచ్చాడు. క‌ల్యాణ్ రామ్ కోరిక నెర‌వేరిందా? లేదా? ఒక సారి చూద్దాం.

క‌థ

గౌత‌మ్ (క‌ల్యాణ్ రామ్‌) బీటెక్ చ‌దివిన కుర్రాడు. త‌న తండ్రి (రావు ర‌మేష్‌)కి నిర్మాణ రంగంలో సాయం చేస్తుంటాడు. అత‌ని త‌మ్ముడికి చెస్ అంటే ఇష్టం. చెస్ లో అత‌నికి ట్ర‌యినింగ్ ఇచ్చి త‌ల్లి (రోహిణి)తో క‌లిపి కోల్ క‌తాలో జ‌రిగే జాతీయ స్థాయి పోటీల‌కు పంపుతాడు. ఇంత‌లో త‌న స్నేహితుడి ల‌వ‌ర్‌ను పప్పు చేసుకోబోతున్నాడ‌ని తెలిసి అమ్మాయిని తీసుకొస్తాడు. త‌మ వంశంలో పెళ్ళి రాత లేదు అని ప‌ప్పు బాబాయ్ (పృథ్వి)మాటిమాటికీ చెప్ప‌డంతో ప‌ప్పు కి పెళ్ళి చేసుకోవ‌డ‌మే గోల్ గా మారుతుంది. త‌ను చేసుకోబోయే అమ్మాయిని తీసుకెళ్ళి వేరే ఒక‌రికి ఇచ్చి పెళ్ళి చేయ‌డానికి నిర్ణ‌యించిన గౌత‌మ్‌తో ఓ స‌వాలు విసురుతాడు. గౌత‌మ్ జీవితంలోకి ఎవ‌రైనా వ‌స్తే ఆ అమ్మాయిని త‌న‌దాన్ని చేసుకుంటాన‌ని చెబుతాడు. ఫోటోగ్ర‌ఫీ అంటే ఆస‌క్తి ఉన్న నందిని (సోనాల్‌) గౌత‌మ్‌లోని దేశ‌భ‌క్తిని చూసి ఆనంద‌ప‌డుతుంది. అత‌న్నే చేసుకోవాల‌ని నిర్ణ‌యిస్తుంది. నందిని తండ్రి (సాయాజీ షిండే) పోలీసు. దాదా (ముఖేష్ రుషి)తో ప‌ప్పుకు ఉన్న సంబంధాలు తెలిసి డీజీపీ పోస్టును ఎర‌గా పెట్టి త‌న కూతురిని ఆ రౌడీకి ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. అదే పోస్టును ఆఫ‌ర్ చేసి హీరో కూడా రంగంలోకి దిగుతాడు. పైకి ఒక‌టి చేసి లోప‌ల మ‌రొక‌టి పెట్టుకుని తిరిగే గౌత‌మ్ ఇవ‌న్నీ ఎందుకు చేశాడ‌నేది ఆలోచించాలి. అదే మిగిలిన క‌థ‌. కేవ‌లం త‌న ప్రేమ కోస‌మే ప‌ప్పు, దాదాతో క‌య్యానికి కాలు దువ్వాడా? అంత‌క‌న్నా బ‌ల‌మైన కార‌ణం ఇంకేమైనా ఉందా? ఇవ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు. ఆలోచింప‌జేసే విష‌యాలు. మ‌లిస‌గాన్ని న‌డిపించే వివ‌రాలు.. స్థూలంగా, సూక్ష్మంగా షేర్ క‌థ ఇదే.

ప్ల‌స్‌పాయింట్లు

బేసిక్ క‌థ బావుంది. త‌నకి జీవితం కావాల్సిన అమ్మాయిని తీసుకెళ్ళాడ‌న్న కోపంతో, హీరో జీవితంలోకి వ‌చ్చే అమ్మాయిని త‌న‌వైపు తిప్పుకోవ‌డ‌మనే కాన్సెప్టు బాగానే ఉంది. కాన్సెప్టు అంటే బేసిక్ లైన్ బావుంది. డైమండ్ ర‌త్న‌బాబు రాసిన డైలాగులు బావున్నాయి. ఫిష్ వెంక‌ట్‌ని విల‌న్ పెళ్ళి చేసుకునే సీను, ప్లాట్‌ఫార్మ్ పై పిల్ల‌ల‌ను నిద్ర‌పుచ్చ‌డానికి రౌడీ బ్యాచ్ పాట‌లు పాడే సీన్లు బావున్నాయి. తొలి స‌గం బావుంది. రావు ర‌మేష్‌, రోహిణి, క‌ల్యాణ్‌రామ్ మ‌ధ్య వ‌చ్చే ఆసుప‌త్రి స‌న్నివేశాలు కంట‌త‌డి పెట్టిస్తాయి. రాయ‌ల‌సీమ యాస అదుర్స్ ర‌ఘుకి సూట్ అయింది. ష‌ఫి త‌న పాత్ర‌లో ఒదిగిపోయాడు. సాయాజీ షిండే త‌న‌కు కేటాయించిన పాత్ర‌లో బాగా చేశాడు. చిరాగ్గా అనే మేన‌రిజం 30 ఇయ‌ర్స్ పృథ్వికి మ‌రోసారి క‌లిసొస్తుంది. సోనాల్ గ్లామ‌ర్ గా న‌టించ‌డానికి ఎక్క‌డా వెనుకంజ వేయ‌లేదు. ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌లో పెద్ద ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ క్లిప్పింగ్స్ వాడుకోవ‌డం, మురారిలో పెళ్ళి పాట‌ను వాడుకోవ‌డం బావుంది. ఎన్టీఆర్‌,ర‌జ‌నీకాంత్ మాస్కులు కూడా క‌నిపించాయి. లుంగీ బాబాగా ఎమ్మెస్ నారాయ‌ణ క‌నిపించ‌గానే గొప్ప‌న‌టుడు ఇక‌లేడు అనే బాధ మ‌న‌సులో తొంగి చూస్తుంది.

మైన‌స్‌లు

చాలా ఉన్నాయి. త‌మ‌న్ పాట‌లు బాగా లేవు. వాటిని తీసిన లొకేష‌న్లు పెద్ద‌గా మెప్పించవు. అందులో డ్యాన్సులు బాగా లేవు. ప‌దాలు బాగాలేవు. నేప‌థ్య సంగీతం ఎక్క‌డా ఎలివేట్ కాదు. బ్ర‌హ్మానందం యాజ్‌యూజువ‌ల్‌గా బ‌క‌రా పాత్ర‌లో క‌నిపించాడు. అప్పుడెప్పుడో ఢీ సినిమా నుంచీ హీరో విల‌న్ డెన్‌కెళ్ళి విల‌న్ ల‌ను మోసం చేయ‌డం చూస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే చూసీ... చూ.............సీ విసిగిపోయాం. ఈ సినిమాలోనూ ఆ ట్రిక్ మెప్పించ‌లేదు. లొకేష‌న్ల పరంగా పెద్ద‌గా ఏమీ లేదు. ఓదార్పు సీనుల్లో జ‌గ‌న్‌ని గుర్తుకు తెచ్చారు. సెకండాఫ్ చాలా వీక్ అయిపోయింది. యిన్ విల‌న్‌గా ముఖేష్ రుషి చేయ‌ద‌గింది పెద్ద‌గా ఏమీ లేదు. ఆశిష్ విద్యార్థి పాత్ర ఉన్నా లేన‌ట్టే. హీరోయిన్ ఫేసులో ఎక్క‌డా ఎక్స్ ప్రెష‌న్స్ లేవు. పోసాని మురుగ‌న్ అనే పాత్ర‌లో క‌నిపించాడు. ఎందుకొచ్చాడో అర్థం కాదు. బొట్టు గురించి ఒక డైలాగు త‌ప్ప అత‌నికి ఇందులో న‌టించే స్కోప్ అస‌లు లేదు. ప్ర‌భాస్ శీను కూడా న‌లుగురితో నారాయ‌ణ‌లాగా క‌లిసి పోయాడు. అంతో ఇంతో దువ్వాసి మోహ‌న్ న‌యం అనిపించాడు. హీరోయిన్ త‌ల్లి, అక్క‌, బావ‌, త‌మ్ముడు పాత్ర‌ల‌న్నీ వేస్టే. సినిమా ల్యాగ్ ఎక్కువ‌గా ఉంది. ఫైట్లలోగానీ, స‌న్నివేశాల్లోగానీ ఎక్క‌డా ఇంటెన్సిటీ లేదు. క‌ల్యాణ్ రామ్ హెయిర్ స్టైల్‌, డ్ర‌స్సింగ్ స్టైల్ కూడా మెప్పించ‌దు.

విశ్లేష‌ణ

క‌థ లైన్ బావుంద‌న్న మాట నిజ‌మే. కానీ ఎగ్జిక్యూష‌న్‌లో తేడా వ‌చ్చింది. క‌థ‌కు త‌గ్గ స‌న్నివేశాల‌ను స‌మ‌కూర్చుకోవ‌డంలో సినిమా దెబ్బ తీసింది. ఎక్క‌డా ఏ సీనూ చూడాల‌ని ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. అక్క‌డ‌క్క‌డా డైలాగులు మాత్రం బావుంటాయి. ఎన్టీఆర్, ర‌జ‌నీకాంత్‌, బాల‌కృష్ణ వంటివారిని వాడుకోవాల‌ని అనిపించ‌డం బావుంది. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే టించ్ అది. కానీ కేవ‌లం అక్క‌డ‌క్క‌డా చ‌మక్కులు మాత్రం క‌థ‌ను న‌డిపించ‌వ‌ని గ్ర‌హించాలి. దాదా ఎలాంటి విల‌నో ఎలివేట్ చేసే అంశాలు లేవు. విల‌న్ ఎంత గ‌ట్టివాడ‌యితే హీరో అంత గట్టివాడ‌ని అర్థం. కానీ ఇక్క‌డ విల‌నిజం తేలిపోయింది. హీరో పైకి హీరోయిన్ కోసం క‌సితో కొడుతున్న‌ట్టుగా అనిపించినా, లోప‌ల త‌న ఫ్యామిలీకి జ‌రిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకోవ‌డం క‌నిపిస్తుంది. కేవ‌లం ఒక ఫోటోలో చెయ్యి చూసి హీరోయిన్ ప్రేమించ‌డ‌మేంటో అర్థం కాదు. తాగుబోతు ర‌మేష్‌ని ఎందుకు పెట్టారో తెలియ‌దు. ఇలా సినిమా మొత్తం చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ప‌టాస్ త‌ర్వాత వ‌చ్చిన సినిమా కాబ‌ట్టి ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకో సారి చెక్ చేసుకుని ఉంటే బావుండేద‌ని అనిపించింది.

బాట‌మ్ లైన్‌: షేర్‌... సో బోర్‌!

రేటింగ్‌: 1.75/5

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment